Thursday, August 17, 2023

కథా రామాయణం - 3

 బాలకాండ

                                                                                     (దశరథ మహారాజు) 

విశ్వామిత్రుడు, రామలక్ష్మణుల సిద్ధాశ్రమ ప్రయాణం!


ఒక రోజు దశరథ మహారాజు సభకు విశ్వామిత్ర మహర్షి వచ్చాడు.

దశరథుడు ఆయన్ని గౌరవించి, కుశల ప్రశ్నలు వేసి మీరు ఎందుకు వచ్చారు? మీకేమి కావాలో  చెప్పండి. చేస్తాను అన్నాడు.

విశ్వామిత్రుడు సంతోషంతో “దశరథ మహారాజా, నేను చేసే యాగాన్ని రావణ అనుచరులైన  రాక్షసులు మారీచ, సుబాహులు పూర్తి చేయనివ్వడం లేదు.   రక్త మాంసాలతో మా ఆశ్రమాన్ని,  యాగాన్ని అపవిత్రం చేస్తున్నారు. నేను వాళ్ళను చంపగలను కానీ, యాగం చేసేప్పుడు   అలా  చెయ్యకూడదు.   

అందుకని రామ లక్ష్మణులను యాగాన్ని కాపాడటానికి పంపు” అని అడిగాడు.

      (దశరథ మహారాజు తో వశిష్ట, విశ్వామిత్రులు) 

రామ లక్ష్మణులు పన్నెండు సంవత్సరాల వాళ్ళు, చిన్న పిల్లలు అని మొదట              ఒప్పుకోలేదు  దశరథుడు కానీ, వసిష్ఠ మహర్షి పిల్లలకు మంచి జరుగుతుంది  పంపమన్న సలహా తో  రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి తో పంపించాడు. 


రామ లక్ష్మణులతో విశ్వామిత్రుడు సిద్దాశ్రమమనే అయన ఆశ్రమానికి బయలుదేరాడు.

అన్నదమ్ములిద్దరూ బంగారు ఆభరణాలు ధరించారు. నడుముకి కత్తిని తగిలించుకొని,           రెండు భుజాలకు పూర్తిగా బాణాలతో నిండి వున్న రెండు అమ్ములపొదులను కట్టుకొని  చూడటానికి మూడు తలలున్న నాగుపాములలా వున్నారు. విపరీతమైన కాంతితో మెరిసిపోతున్నారు.

వాళ్ళ అందానికీ, ధైర్యానికీ విశ్వామిత్రుడు ఆనంద పడిపోయాడు.   


సాయంత్ర సమయానికి సరయు నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరారు.

అప్పుడు విశ్వామిత్రుడు  రాముని చూసి "నదిలో స్నానం చేసిరండి మీకు చక్కని మంత్రము నేర్పుతాను. దానివల్ల మీకు, ఆకలి, నిద్ర, అలసట ఉండవు. నిద్రలో ఉన్నప్పుడునైనా మీకెవరూ అపకారము చేయలేరు." అని అన్నదమ్ములకు బల, అతిబల అనే బ్రహ్మ సృష్టించిన మహామంత్రములను రామలక్ష్మణులకు నేర్పాడు. దానివల్ల రామలక్ష్మణులు విపరీతమైన తేజస్సు పొందారు.

చీకటి పడిందని ఓ చోట ఆరాత్రి పడుకొన్నారు. మెత్తటి  పరుపుల మీద పాడుకొనే రాజకుమారులు గడ్డి నేలమీద కూడా అదే విధంగా ఏ ఇబ్బంది లేకుండా పడుకున్నారు.  ఎవరైనా ఇలా ఉండాలి  అని నేర్చుకోవాలి. అన్ని రోజులూ ఒకేలా ఉండవు, ఏ పరిస్థితిలోనైనా ఒకే విధంగా ఉండడం  నాయకుని లక్షణం. అది రామలక్ష్మణులు  చిన్నతనంలోనే అలవాటు చేసుకున్నారు.

మరునాడు ఉదయాన్నే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నిద్ర లేపాడు.

ఇంకో విషయమేమిటంటే గురువు అంటే మనకు విద్య నేర్పేవాడు అంటే పాఠాలు మాత్రమేకాదు. ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో ఆ విద్యలన్నీ ప్రేమగా బాధ్యతగా  మననుండి ఏమీ  ఆశించకుండా నేర్పేవాడు గురువు.

తాటక సంహారం

ఉదయాన్నే విశ్వామిత్రుడు రాముణ్ణి "నాయనా రామా లే నిద్రలే నాయనా,  సూర్యోదయమవుతోంది. మనం దేవతాకార్యం చేయవలసి ఉన్నది కదా, నిద్రలే" అని లేచిన రాముడు స్నానం చేసి, గాయత్రి జపం చేసికొనిన తర్వాత మళ్ళీ బయలుదేరారు.

ఆరోజంతా నడిచి, భీకరమైన హోరుమని శబ్దం వస్తోన్న వైపు చూద్దామని వెళ్లారు. సరయు నది గంగా నదిలో కలిసే ప్రదేశం అది. అక్కడ చాలా మంది ఎంతో జ్ఞానం ఉన్న ఋషులను చూశారు. ఆ నదీ సంగమంలో స్నానాదికాలు పూర్తి చేసుకొని బయలుదేరారు.          

ఆ ప్రదేశాన్నిఅంగ దేశం[1] అంటారని రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు వివరించాడు.

ఆ రాత్రికి ఆ ఋషుల ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని మర్నాడు బయలుదేరారు.  గంగానదిని కూడా దాటారు. దాటుతూనే ఒక భయంకరమైన అడవిలోకి అడుగు పెట్టారు.  చాలా పెద్ద చెట్లు ఒక దానికొకటి రాసుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి.  అడవి జంతువులు ఘోరంగా అరుస్తున్నాయి, అక్కడి వాతావరణమంతా భయం పుట్టేట్టు గా వుంది. ఇంకా కొంచెం దూరములో పూర్తిగా పాడుబడ్డ, మనుషులు ఎవ్వరూ లేని  ఊర్లు కనబడ్డాయి. అక్కడ ఏదో తెలియని అలజడిగా ఉంది.

రాముడు విశ్వామిత్రుని తో "స్వామీ ఏమిటీ ఈ ప్రదేశము ఇంత భయంకరముగా,  ప్రతికూలశక్తి వున్నట్టుగా వుంది ఎందుకు?" అని అడిగాడు.

అప్పుడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో చెప్పాడు

"ఇది తాటకారణ్యము"

"చాలా రోజుల క్రితం ఇక్కడ మలద, కరూశ[2] మనే ఊళ్ళు జనాలతో కళకళలాడుతూ     ఉండేవి.  ఇక్కడ తాటక[3] అనే వెయ్యి ఏనుగుల బలమున్న రాక్షసి దాని అతి భయంకరమైన, క్రూరమైన మారీచుడనే కొడుకుతో కలసి ఈ రెండు ఊర్ల మీదపడి అందరిని తిని ఈ ఊర్లను స్మశానాలుగా  చేసింది. రామా నువ్వు ఇప్పుడు ఆ రాకాసిని చంపాలి" అని చెప్పాడు.

రాముడు సరే మా తండ్రి గారి అనుజ్ఞ  మరియు మీ ఆజ్ఞతో తప్పకుండా చేస్తానని తన ధనుస్సు ఎత్తి పట్టుకుని వింటి నారిని లాగి వదిలాడు. అప్పుడు పుట్టిన చప్పుడు  విని అడవిలో మృగాలన్నీ చెల్లాచెదురుగా పరుగులు పెట్టాయి. ఒక్కసారే కొన్ని వేల పిడుగులు  పడ్డాయా అన్నంత శబ్దం అయింది. 

                                            (తాటక)

ఆ ధ్వని ఆగుతూనే ధన్, ధన్ అని భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ, అరుస్తూ తాటక వచ్చి   రామలక్ష్మణుల మీద పడింది. విశ్వామిత్రుడు హుంకారం చేస్తూ దాన్ని అడ్డగించి, రామా ‘నీకు  శుభమగుగాక, ఇది ఆడది అని చూడకు’ దీన్ని వెంటనే చంపెయ్యి అని ఆజ్ఞాపించాడు. రాముడు దానిరెండుచేతులనూ బాణాలతో నరికేశాడు. లక్ష్మణుడు దాని మీదకు దూకి ముక్కు చెవులు  కోసేశాడు,భయపడి వెళ్లిపోతుందేమో అని. అయినా అది మాయతో రాళ్లు, దుమ్ము వాన  కురిపిస్తోంది.  రాముడు ఇక లాభం లేదు అనుకొని మరో బాణాన్ని తాటక గుండెలోకి కొట్టాడు.  దాంతో అది చచ్చి పడిపోయింది. 

రామలక్ష్మణుల సౌర్య పరాక్రమాలకు ఇంద్రుడు దేవతలు వచ్చి మాములు బాణాలతోనే  ఇంతటి బలమైన రాక్షసిని చంపాడు. విశ్వామిత్రా రాముడు నీకు సరి అయిన శిష్యుడు, నీ దగ్గరున్న అస్త్ర సంపదంతా శ్రీ రామునికి అంద చేయమన్నారు.


దివ్యాస్త్ర సంపద

తనేమనుకున్నాడో దేవేంద్రాదులు కూడా అదే చెప్పారు. రాముణ్ణి పిలిచి అన్ని అస్త్రాలను  అందించాలని నిశ్చయించాడు.

విష్ణు చక్రము వంటి అన్ని రకాల చక్రాలనూ, మోదకము వంటి గదా ప్రయోగాలను, శివ శూలము, బ్రహ్మ శిరోనామకము, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, వరుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము,  వాయువ్యాస్త్రము, భాస్కరాస్త్రము, మానవాస్త్రము మోహనాస్త్రము మొదలైన అన్ని రకములైన  అస్త్రాలను ప్రయోగ, ఉపసంహర విద్యలను అన్నింటిని రామునకు విశ్వామిత్రుడు నేర్పాడు.  రాముడు  లక్ష్మణునకు అంద  చేశాడు. అస్త్రాది దేవతలంతా రాముని ముందు ప్రత్యక్షమై     "స్వామీ మీ ఆజ్ఞ అనుసరించి మీరు స్మరించిన వెంటనే మీ సంకల్పాన్ని నెర వేరుస్తామని"  మాట ఇచ్చి  అదృశ్యమయ్యారు.

సిద్ధాశ్రమము

అక్కడినుండి రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు ఎంతో  దట్టమైన అడవిలోకి వచ్చారు. అక్కడంతా చక్కటి పూల వాసనలు, అద్భుతమైన పళ్ళ చెట్లూ, పక్షుల కిలకిలారవాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. క్రూరమృగాలు, సాధు జంతువులూ కలసి తిరుగుతున్నాయి.

విశ్వామిత్రుడు రామునితో "నాయనా ఇదే సిద్ధాశ్రమం[4]. ఇక్కడ పూర్వం శ్రీ మహా విష్ణువు తపస్సు చేసాడు.               

ఈ సిద్ధాశ్రమంలో  కశ్యపప్రజాపతి కే శ్రీ మహావిష్ణువు వామనుడిగా జన్మించి బలిని జయించాడు.       ఇక్కడే కశ్యప  ప్రజాపతి సిద్ధి పొందాడు " 

"అందుకే దీన్ని సిద్ధాశ్రమము అంటారు”

ఇక్కడ చేసే తపస్సు కొన్ని వేల రెట్ల ఫలితాన్నిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఈ యాగాన్ని  నిర్వహిస్తున్నాను. నువ్వు సర్వసన్నద్దుడవై ఈ యాగాన్ని సంరక్షించు." అని యజ్ఞాన్ని పూర్తి  చెయ్యడానికి కంకణ బద్ధుడైనాడు.

యాగ సంరక్షణం

విశ్వామిత్రుడు యాగ నియమాన్ని అనుసరించి మౌన వ్రతములో వున్నాడు.  ఆ రోజు సూర్యోదయానికి ముందే కాలకృత్య, సంధ్యాది విధులను పూర్తిచేసుకున్న రామ లక్ష్మణులు ఆశ్రమంలోని ఋషుల వద్దకు వెళ్లి వినయ పూర్వకంగా "రాక్షసులు ఎప్పుడు రావచ్చు చెప్పండి, మేము యాగ  సంరక్షణను నిర్విఘ్నంగా పూర్తి  చేస్తాము" అని అడిగారు.

దానికి ఋషులు “నేటినుండి ఆరు రాత్రులపాటు జాగ్రత్తగా ఉండమని” చెప్పి వారి పనిలో వారు నిమగ్నమైనారు.

ఆరు రోజులు గడిచాయి. ఆరవరోజు రాత్రి ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్మున్నట్టుగా తాటక  కొడుకు మారీచుడు, సుబాహువు ఇంకా వేలాది రాక్షసులతో గుంపుగా వచ్చి యజ్ఞవేదికపైకి రక్త మాంసాలు గుమ్మరించారు. యజ్ఞవేదిక  అంతా రక్తమయమై ఎర్రగా మెరుస్తోంది. రాముడు లక్ష్మణునితో తమ్ముడూ ఈ రాక్షసుల పని  పడదామని చెప్పి మానవాస్త్రము మారీచుని మీదికి ప్రయోగించాడు. తమ్ముడూ ఈ మానవాస్త్రము  దయగలది వీడిని చంపదు, బలంగా దెబ్బకొట్టి దూరంగా విసిరి వేస్తుంది అంటూ,  ఆగ్నేయాస్త్రాన్ని సుబాహునికి గుండెలో నాటు కునేట్టు వేశాడు. సుబాహుడు చచ్చిపోయాడు.  మారీచుడు ఎక్కడో  చాలా దూరంగా పడిపోయాడు. రాక్షసులు చనిపోయిన వాళ్ళు పోగా  మిగతా వాళ్ళు  పారిపోయారు. ఆ విధంగా యాగం సంరక్షించాడు శ్రీ రాముడు.

మర్నాడు ఉదయం పూజాదికాలు అయిపోయిన తర్వాత రాముడు విశ్వామిత్రుని వద్దకు వచ్చి

 "స్వామీ మీరు నాన్నగారిని అడిగిన కోరికను, మీ అనుగ్రహం వల్ల ఏ ఆటంకము లేకుండా సంరక్షణ చేయాలిగాము".

"మన తర్వాతి పని ఏమిటి?" అని అడిగాడు.

అప్పటికే విశ్వామిత్రుడు రాముని గురించి ఆలోచిస్తూ ఈ యాగాన్ని ఏ ఇబ్బంది లేకుండా  పూర్తి చేయటానికి రాముడు ఎంతో సహాయం చేసాడు, మరి చేసిన సహాయానికి నేనుకూడా  ఆయనకు ఏదయినా మంచి చెయ్యాలి కదా అని అనుకున్నాడు.

అప్పుడు విశ్వామిత్రునితో ఉన్న మునులు "రామా మిథిలా నగరంలో జనక మహారాజు యజ్ఞం  నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్లాలని బయలుదేరుతున్నారు. మీరు తోడుగా వెళ్ళండి" అన్నారు.

"మరి జనక మహారాజుగారు మనలను పిలవలేదుగా" అన్నాడు రాముడు.

"యజ్ఞ, యాగాలకు ఎవరైనా వెళ్ళవచ్చు పిలవ వలసిన పని లేదు" అన్నారు మునులు.

దారిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తన కుటుంబ చరిత్ర[5], కుమారస్వామి జననం[6],  గంగావతరణం[7] చెప్పాడు. అలా రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలసి మధ్యలో విశాల నగరం[8]లో మహారాజు సుమతి ఆతిథ్యాన్ని స్వీకరించి  రాత్రి అక్కడ గడిపి మరునాడు ఉదయాన్నే మిథిలా నగరానికి బయలుదేరారు.

 


Wednesday, August 9, 2023

కథా రామాయణం - 2

                                                                 బాలకాండ


      (వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడు )   
                                                                          

ఓరోజు వాల్మీకి మహాఋషి ఆశ్రమానికి  నారదుడు వచ్చాడు.

వాల్మీకి నారదునికి నమస్కరించి కుశల ప్రశ్నలు వేసి, అతిథి మర్యాదలు చేసాడు.

కొంతసేపాగి వాల్మీకి నారదుణ్ణి ఇలా అడిగాడు.

"మహానుభావా ఈ లోకంలో ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడేవాడు, ధర్మం  తప్పని  వాడూ, మంచి కోసం చెడుని ఎదిరించి గెలిచేవాడూ,  ఉత్తమమైన  గుణములు వున్నవాడూ,  మహా వీరుడూ,  చూసేకొద్దీ చూడాలనిపించే అంత అందమైన వాడూ మొదలయిన గొప్ప                   లక్షణాలున్నవాడు ఎవరైనా ఈ లోకంలో వున్నాడా" అని అడిగాడు. 

  "ఉన్నాడయ్యా వాల్మీకీ, ఆయన శ్రీరామచంద్రుడు. అయోధ్య మహారాజు" అని  శ్రీరాముడు పుట్టుక నుంచి పట్టాభిషేకం వరకూ జరిగింది చెప్పి వెళ్లి పోయాడు.

తరువాత తమసా నదికి స్నానం చేయడానికి వెళ్లి అక్కడ పక్షులను వేటాడే ఒక బోయవాడు  జంటగా ఉన్న రెండు పక్షులలో మగపక్షినిబాణమేసి చంపాడు. మిగిలిన ఆడ పక్షి ఏడుస్తూ  ఆ చనిపోయిన పక్షి చుట్టును తిరుగుతూ ఏడుస్తోంది.                                            అది చూసిన వాల్మీకి కోపంతో ఆ బోయవాడిని ఇలా శపించాడు.

                                                                                                                                                                          (కోపంతో వాల్మీకి) 

 "మానిషాద ప్రతిష్ఠాం త్వం ఆగమః శాశ్వతీః సమాః ।

యత్ క్రౌంచమిథునాదేకం అవధీః కామమోహితః ॥"


"కిరాతకుడా! పక్షిజంటలో ఒకదానిని చంపి, నీవు శాశ్వతంగా చెడ్డవాడివయ్యావు"   అన్నాడు, వాడు భయపడి పారిపోయాడు.

ఆశ్రమానికి వచ్చిన వాల్మీకి నేను ఎందుకిలా అన్నాను. ఎందుకింత బాధగా మాట్లాడాను.

అని ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ, దేవతలతో కలసి వచ్చాడు.


             (బ్రహ్మ రామకథను వ్రాయమని వాల్మీకికి చెప్పుట)

బ్రహ్మ వాల్మీకితో "వాల్మీకీ, బాధపడకు. నువ్వు తప్పు చేయలేదు. నీ నోటిలోంచి వచ్చిన  శ్లోకం మాదిరిగానే రామకథలో జంటను వేరు చేసిన వాడు నశించాడు కథ రచన చేసి,  లోకానికి అందచెయ్యి. నీ బాధ కూడా తగ్గిపోతుంది"  అని చెప్పాడు.

‘‘నా అనుగ్రహంతో రామకథలోని ఎవరెవరు  ఏఏ పనులు చేసిందీ,                                             వారేం మాట్లాడిందీ, ఎలా ఆలోచించిందీ అన్నీ నీ దివ్యదృష్టికి తెలుస్తాయి.                                        నువ్వు రచించిన   శ్రీ రామకథఈ లోకం అంతటా వ్యాపించి, పర్వతాలూ,  సముద్రాలూ, సూర్య చంద్రులూ  ఉన్నంతకాలం  ఉంటుంది" అని ఆశీర్వదించి 

వెళ్ళిపోయాడు.

(వాల్మీకి, రామాయణ రచన)

వాల్మీకి రామకథను పూర్తి చేశాడు. ఈకథ పాడుకోవడానికి వీలుగా కూడా ఉంది.      ఆయన ఆశ్రమంలోనే ఉన్న లవ కుశలకు ఈ కథను నేర్పి,లోకంలో ప్రచారం                 చెయ్యమని   పంపాడు.

లవకుశులు ఇద్దరూ రామకథ పాడుకుంటూ అయోధ్య చేరారు. అయోధ్యలో జనమంతా  మైమరచిపోయి రామకథను వింటున్నారు. అది విని శ్రీ రాముడు లవకుశులను సభకు  పిలిపించి శ్రీ రామకథను అందరితో కలసి కింద కూర్చుని తన్మయత్నంతో వింటున్నాడు.             లవకుశులు రామకథ మధురంగా వినిపిస్తున్నారు.


శ్రీరామ జననం

                                                                     (అయోధ్య)  

అయోధ్య చాల గొప్ప నగరం. కోసలకు రాజధాని.  రాజు పేరు దశరథుడు.

ఆయనకు ముగ్గురు భార్యలు.   కౌసల్య, సుమిత్ర, కైకేయి.

దశరథ మాహారాజు ముసలి వాడయ్యాడు.  అరవై వేలవ పుట్టినరోజుకూడా అయిపోయింది.

ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆరోజు వారి రాజగురువు వసిష్ఠ మహాఋషిని కలిసి              "నేను ముసలి    వాడినయ్యాను. ఇంతవరకూ పిల్లలు పుట్టలేదు.  నాకు ఓపిక తగ్గిపోతోంది. ఏదైనా పూజ చేస్తే దేవుడు దయతలచి పిల్లలు కలగటానికి  దారి చూపుతాడేమో చెప్పండి" అన్నాడు. 

దానికి వసిష్ఠుడు "సరే రాజా, పుత్రకామేష్ఠి అని ఒక యాగము చేద్దాం. మీ కోరిక తీరుతుంది.  ఆయాగం చేయించడానికి ఋష్యశృంగుడు అనే ఒక గొప్ప ఋషి సహాయం తీసుకుందాం".    అన్నాడు.

పుత్రకామేష్ఠి యాగము అంటే, పుత్రులు అంటే పిల్లలు కావాలని చేసే ఒక యాగము.

 "తాతా" అంది నా మనుమరాలు.

"ఏమ్మా మళ్ళీ ఏమిటి" అన్నాను.

"ఎందుకంత పెద్ద పూజ అదే యాగం". అని అడిగింది.

ఎందుకంటే అందరి పూజలు అందుకునే వాడూ, అందరికి దిక్కైన వాడూ, అన్నిటికన్నా  గొప్పవాడూ అయిన శ్రీమహావిష్ణువు మనిషిగా దశరథుడికి పుడతానని, రావణాసురుడిని  చంపుతానని, లోకాలకు రక్షగా ఉంటానని అంతకుముందు దేవతలకు వరమిచ్చాడు.  మరి ఆయన పుట్టాలంటే ఎంతో పుణ్యము, ఎన్నో పూజలు చేయాలి మరి.

సరే నువ్విలా ప్రతిసారి అడ్డం తగలొద్దు. దీన్ని బాలకాండ అంటారని చెప్పా కదా.  ఇది చెప్పటం అయిపోయిన తర్వాత నీ డౌట్లు  అడుగు. నేను క్లియర్ చేస్తా. ఇంకోటి,  అన్ని కాండలకు ఇంతే మరి. మధ్యలో డిస్టర్బ్ చెయ్యొద్దు. అని తిరిగి కథలోకి వెళ్లిపోయాను.

అలా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తున్నాడు. అంతలో ఆ యజ్ఞగుండం మధ్యలో   ఒక పేద్ధ ఆకారం తో యాగ పురుషుడు బంగారుగిన్నెతో  ప్రత్యక్షమై,  దశరథ మహారాజా  దీనిలోని పాయసాన్ని మీ భార్యలకు పంచు. నీకు అంతా మంచి జరుగుతుంది అని,  ఆ పాయసాన్ని దశరథునికి ఇచ్చి మాయమైపోయాడు.

దశరథుడు ఆనందంతో ఆ పాయసంలో సగం పెద్ద భార్య అయిన కౌసల్యకు,  మిగిలినదానిలో  సగం సుమిత్రకు, ఆ మిగిలిన దాంట్లో సగం కైకేయికి ఇచ్చి,   చేతిలో మిగిలిన నాలుగవ భాగాన్ని  మళ్ళీ సుమిత్రకు రెండవసారి ఇచ్చాడు.

కొన్ని నెలలకు మొదటి సగం పాయసం తీసుకున్న కౌసల్యకు శ్రీ రాముడు,           మూడవ భాగము  తీసుకున్న కైకేయికి భరతుడు, రెండవ నాల్గవ భాగాలను తిన్న  సుమిత్రకు లక్ష్మణ,  శత్రుఘ్నులు కవలలుగా పుట్టారు.

శ్రీ రాముడితో లక్ష్మణుడు, భరతునితో శత్రుఘ్నుడు ఒక జట్టుగా వుండే వాళ్ళు.

రాముని వదిలి లక్ష్మణుడు ఒక్క క్షణమైనా ఉండేవాడు కాదు. అన్నకు తోడుగా  లక్ష్మణుడు ఎప్పుడూ వెంటనే ఉండేవాడు.

             (రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు )

అన్నదమ్ములు నలుగురూ గురువు గారు వశిష్ఠుని దగ్గర చదువుకుంటున్నారు.

పన్నెండు సంవత్సరాలు గడిచాయి....



 

Tuesday, August 8, 2023

కథా రామాయణం - 1

 కథా రామాయణం

అందరు తాతలకు కథలడిగే మనవలుమనవరాళ్లు వుంటారు. వాళ్ళల్లో ఒకతి నా మనుమరాలు   సహస్రనా చిట్టితల్లికి చెప్పిన శ్రీరామ కథను మిగతా తాతల సౌకర్యార్థం...


ఓ రోజు బీరువాలో వున్న పుస్తకాలు అన్ని సర్దుతున్నాను. ఐదు సంవత్సరాల నా మనమరాలు  సహస్ర  నేను చేసేది చూస్తూ.

"ఈ బుక్స్ ఏంటి తాతా ఇంత లావుగా వున్నాయి, ఇన్ని వున్నాయి" అంది.

"ఇది రామాయణం" అన్నాను.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణ మందారాన్ని చూపిస్తూ. ఇది రామాయణం, ఇవి తొమ్మిది  పుస్తకాలు ఉంటాయి. మొత్తం ఆరు కాండలు అంటారు. దీనిని వాసుదాసు గారు వ్రాసారు.

"మీ ఆఫీసు వా" అన్నది.

కాదురా “రాముడు జేజ స్టోరీ” అన్నాను.

"స్టోరీ నా ఏమి స్టోరీ" అన్నది.

"మాన్స్టర్ ప్రిన్సెస్ ని ఎత్తుకు పోతాడు. ప్రిన్స్ మాన్స్టర్ చంపి ప్రిన్సెస్ ని సేవ్ చేసి తెచ్చుకుంటాడు". అని చెప్పాను.

''మరి ఇది'' అంది భాగవతాన్ని చూపిస్తూ

"ఇది లిటిల్ కృష్ణ స్టోరీ" అన్నాను.

అంతకు ముందు రోజే టీవీ లో లిటిల్ కృష్ణ యానిమేటెడ్ మూవీ చూశాము ఇద్దరమూ కలిసి.  దాన్లో చిన్ని కృష్ణుడి లీలలు ఆనందమూ ఆశ్చర్యము తో చూసింది.                "మరైతే ఈ స్టోరీస్ నాకు  చెప్పవా  తాతా" ప్లీజ్ అంది.

"రాత్రి పడుకున్నప్పుడు చెప్తాలే,యిపుడు పనిఉంది" అని ఆ పుస్తకాలన్నీ సర్దే పనిలో పడి పోయాను.


ఆ రాత్రి

"తాతా కథ చెప్పవా" అని నా మనుమరాలు సహస్ర నా దగ్గర పడుకొని నా చెంపమీద చేత్తో  రుద్దుతూ గారంగా అడిగింది.

"ఏ కథ చెప్పనూ" అంటే, మాన్స్టర్ కథ చెప్పు. మాన్స్టర్ ప్రిన్సెస్ ని ఎత్తుకు పోతుంది కదా            అది చెప్పు లేకపోతే లిటిల్ కృష్ణ స్టోరీ చెప్పు" అంది.  ఆ రోజు ఉదయం బుక్స్ విషయాన్ని గుర్తుచేస్తూ.

 

నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. మా నానమ్మ కమలమ్మ గారి దగ్గర పడుకొని విన్న రామాయణ,     భాగవత కథలు గుర్తొచ్చాయి. మా తాతగారు దుర్గరాజు లక్ష్మీనారాయణ గారు రోజూ రామాయణ పారాయణ  చేసుకొనే విషయం  గుర్తొచ్చింది.  రామాలయ ప్రతిష్ట,  ఆ ఆలయంలో రోజూ చేసే  రామ భజన అంతా ఓ ఫ్లాష్ బ్యాక్ లా కళ్ళముందు గిర్రున తిరిగాయి.

 

ఓహ్, మాది కదా అదృష్టం. మా తాత గారూ, నానమ్మ, మా నాన్న గారూ మా చిన్నప్పుడు మాకు  ఇలా రాత్రి పడుకునే ముందు కథలు చెప్పేవారు. మా పిల్లలు పుట్టి పెరిగి వచ్చే సమయానికి  పై ముగ్గురూ వెళ్లిపోవడం, మా అమ్మ అనారోగ్యం తో, మా నగర జీవితంతో మా పిల్లలు మన  పురాణ కథలు,  ఇతిహాసాల గురించి  వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవడమే కానీ మేమేమీ  చెప్పలేకపోయాము.  ఇప్పుడు నా మానమరాలుకి ఆ లోటు రాకూడదని ముందుగా  రామాయణం చెపుదామని నిర్ణయానికొచ్చాను.

 

చిరు కథా రామాయణం

బాలకాండ

"అయోధ్య" కు రాజు వయసులో పెద్ద వాడైన దశరథ మహారాజు. ఆయనకు ముగ్గురు భార్యలు.  కౌసల్య, సుమిత్ర, కైకేయి.


వాళ్లకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రఘ్నుడు అనే నలుగురు పిల్లలు.


ఓరోజు  వాళ్ళ దగ్గరకు విశ్వామిత్రుడు అనే ఋషి వచ్చి దశరథుడిని "రామ లక్ష్మణులను నాతో  పంపించండి, నేను చేస్తున్న యాగానికి వాళ్ళు రక్షణగా ఉండి రాక్షసులనుండి కాపాడుతారు"  అని అడిగాడు.

 

దశరథుడు ముందు రామ లక్ష్మణులు చిన్నవాళ్లు అని ఒప్పుకోకపోయినా వాళ్ళ గురువు    వశిష్ఠుడు  "రామ లక్ష్మణులకు మంచి జరుగుతుంది పంపండి" అంటే  పంపిస్తాడు.

 

రామ లక్ష్మణులను వెంటపెట్టుకొని విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్తోంటే దారిలో తాటకి  అనే రాక్షసి వాళ్ళని మింగటానికి  వస్తుంది. దాంతో రాముడు తాటకి ని చంపేస్తాడు. 

 

విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్లిన తర్వాత యాగం జరిగేటప్పుడు ఆశ్రమము మీదికి దాడికి  వచ్చిన రాక్షసులలో సుబాహుడు అనేవాడిని చంపేసి  మారీచుడుని దూరంగా పడేట్టు కొడతాడు.  విశ్వామిత్రుడు,   యాగం పూర్తి అయిన  తర్వాత రామలక్ష్మణులను వెంటపెట్టుకొని మిథిలా నగరానికి వెళ్తాడు.  దారిలో రాముడు ఓ చోట  భర్తకు దూరమైన  అహల్య అనే ఆమెను ఆమె భర్త  గౌతముని  దగ్గరకు చేరుస్తాడు.

 

మిథిలా నగరంలో శివధనస్సు విరచి స్వయంవరంలో సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు రాముడు.   లక్ష్మణునికి ఊర్మిళ,  భరతునికి మాండవిని, శత్రఘ్నునికి శృతకీర్తిని ఇచ్చి పెళ్లి చేస్తారు.

 

అందరు అయోధ్యకొచ్చి హాయిగా వుంటారు.

 

అయోధ్యకాండ 

 

అలా కొన్ని రోజులు గడిచాయి.

 

"ఆగు తాతా ఆగు" అంది నా మనుమరాలు సహస్ర.

 

“ఏంట్రా” అంటే.

"వయసులో పెద్దవాడైన దశరథుడికి అంత చిన్నపిల్లలేంటి?

రాముడు, లక్ష్మణుడు చిన్న వాళ్ళని తెలిసీ విశ్వామిత్రుడు వాళ్ళను అంత పెద్ద రాక్షసులు  వుండే దగ్గరకు ఎందుకు  తీసుకు పోయాడు?

పెద్ద రాక్షసులను చిన్న వాళ్ళైనా రామలక్ష్మణులు ఎలా ఓడించారు?

పెద్ద వాడైన విశ్వామిత్రుడు ఉన్నప్పుడు, అహల్యను ఆమె భర్త దగ్గరకు రాముడు పంపడమేంటి?

స్వయంవరమంటే ఏంటి?

శివధనస్సు విరగ్గొట్టటమెందుకు?

ఓకే, శివధనస్సు విరగ్గొడితే రాముడికి సీత కు పెళ్లి చేశారు. మరి ఏమీ విరగ్గొట్టకుండా మిగతా  ముగ్గురు పెళ్లిళ్లు ఎలా చేశారు?

అసలు రాముడు లక్ష్మణుడు ఇద్దరు మాత్రమే వెళితే, మరి భరతుడు శత్రఘ్నుడు ఎలా పెళ్ళికి  వచ్చారు?

డీటెయిల్స్ లేకుండా స్టోరీ చెప్పొద్దు  తాతా. క్లియర్ గా చెప్పవా?"

"ఓసి భడవా భలే అడిగావే, ఈ రోజుకి ఇంతే పడుకో".

రేపటి నుంచీ క్లియర్ గా చెపుతాను అన్నాను నేనో నిర్ణయానికి వస్తూ.

 

ముందు నేను రామాయణం చదివి దాని యథాతథ కథా రూపాన్ని నా మనుమరాలికి  చెపుదామనుకున్నాను.  మా ఇంట్లో వున్న శ్రీ వాసుదాస స్వామి వారి శ్రీ మదాంధ్ర వాల్మీకి  రామాయణం(మందరం) ను చదవాలని నిశ్చయించుకొని నా మనుమరాలికి  ఉపోద్ఘాతంగా రామాయణాన్ని ఈ విధంగా పరిచయం చేశాను.

 

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం

ఆరుహ్య కవితా శాఖామ్ వందే వాల్మీకి కోకిలమ్!


కథా రామాయణం


ఎవరు ఏ కథ వ్రాసినా కథానాయకుడు, ప్రతినాయకుడు వారి ఇద్దరికీ మద్దతుగా ఇతర  పాత్రలు ఉంటాయి.

ప్రతినాయకుడు అతి బలవంతుడు. మహా క్రూరుడు అయి ఉంటాడు.                                    బలహీనులను,          మంచి  వాళ్ళను ఏడిపించేవాడూ,  ఆడవాళ్లను చెరపట్టేవాడూ,   లోకాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునేవాడుగా ఉంటాడు.  ప్రతి వ్యక్తి లో  విరుద్ధ వ్యక్తిత్వము వున్నట్లే, ఒక్కోసారి మంచిగా వున్నట్టుగా  ఉంటాడు. అతడే రావణుడు.

(ఇప్పటి పిల్లలకు అర్ధమయ్యే భాషలో ప్రతినాయకుడంటే బాహుబలి లో భళ్లాల దేవుడు,  అవెంజర్స్ లో థానోస్, కే జి ఎఫ్ లో అధీర. రావణుడు వీళ్లకు కొన్ని వేల రెట్లు శక్తిమంతుడు,  అన్ని లోకాలనూ గెలవగలిగిన వాడు అన్న మాట.)

మరి కథానాయకుడు తల్లి తండ్రులు, గురువులంటే భక్తి, అన్నదమ్ములంటే ప్రేమ, స్త్రీల పట్ల  గౌరవం, సమాజమంటే బాధ్యత, విద్యా జ్ఞాన సంపన్నుడు, ఇచ్చినమాట తప్పకపోవడం, విరుద్ధ  భావాలు, విరుద్ధవ్యక్తిత్వాలు లేకుండా వుండడం,అందరిని సమంగా చూడడం, శత్రువులతో    కూడా పొగడ్తలు పొందేవాడు,  ఏ శక్తినైనా తన అపరిమిత శక్తితో భయం లేకుండా  ఎదిరించేవాడూ,ధర్మాన్ని పాటించేవాడు,  అధర్మాన్ని ఎదిరించేవాడు, మొదలు పెట్టిన పనిని  పూర్తి అయ్యేంత వరకు వదలనివాడు,  అందరికి  మార్గదర్శి, ఆదర్శప్రాయుడు,  అందంలో మగవారినికూడా  మోహింప చేయ గలిగేవాడూ, స్నేహితులకు ధైర్యమయ్యేవాడు,  శత్రువులకు మృత్యువయ్యేవాడు,  కష్టంలోనూ, సుఖంలోనూ ఒకే విధంగా ఉండేవాడు,  ఇన్నివున్నా వినయంగా ఉండేవాడు అయి  ఉండాలి. ఉన్నాడు. 

 

 ఆయనే మన శ్రీ రాముడు.

 

కథానాయకుడంటే సినిమాల్లో చూపించేవాడు కాదు.

మనకున్న ఒకే కథానాయకుడు మన శ్రీరాముడు. ఆయన భార్య సీతాదేవి మాత్రమే కథానాయకి.

వారి జీవితాల్లో జరిగిన కథే రామాయణం.

నా మనుమరాలి కోసం మొదలు పెట్టిన ఈ కథా రామాయణ సంకల్పం నిర్విఘ్నంగా  కొనసాగాలని  గణపతిని, సరస్వతిని శ్రీ రామచంద్రుని ప్రార్థిస్తూ...

  

విఘ్ననాయక ప్రార్థన

శుక్లాంబరధరమ్ విష్ణుం శశి వర్ణం చతుర్భుజమ్

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేII

 

భారతీ  ప్రార్థన

క్షోణి తలంబునన్  నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర

శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్

వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్II

 

హనుమత్ ప్రార్థన

మనోజవమ్ మారుత తుల్య వేగమ్

జితేంద్రియమ్ బుద్ధిమతామ్ వరిష్ఠమ్

వాతాత్మజమ్ వానర యూధ ముఖ్యం

శ్రీరామ దూతం శిరసా నమామిII

 

ఆంజనేయ మతిపాటలాననం

కాంచనాద్రి కమనీయ విగ్రహమ్ 

పారిజాత తరుమూల వాసినమ్

భావయామి పవమాన నందనం

 

శ్రీ రామచంద్ర ప్రార్థన

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘు కులాన్వయ రత్న దీపమ్

ఆజానుబాహు మరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామిII

 

వైదేహీ సహితం సురధృమతలే హైమే మహామంటపే

మధ్యే పుష్పకమాసనే, మణిమయే, వీరాసనే సుస్థితమ్

అగ్రేవాచయతి, ప్రభంజనసుతే తత్వం మునిభ్యం పరం

వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామంభజే శ్యామలమ్II

 

రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటనేను

నాకేమి భయంబు, చింతలికనేమిటి కేమి ఘటించినన్

రఘు స్వామిదె కీర్తి, సత్యమిది సత్యము నాకు బనేమటంచు

నేనీ మహనీయకీర్తివిని, నిన్నెర నమ్మితి జానకీపతీII

 

చరితం రఘనాధస్య శతకోటి ప్రవిస్తరమ్

ఏకైకమక్షరం ప్రోక్తం, మహాపాతక నాశనమ్II

 

బాలకాండ లోని పాత్రలు – పరిచయం

వాల్మీకి - శ్రీ రామాయణ రచయిత

నారదుడు - బ్రహ్మ కుమారుడు, రామాయణాన్ని వాల్మీకికి వినిపించిన వాడు.

బ్రహ్మ - సృష్టికర్త, పురాణం ఇతిహాసాల ప్రకారం ఈ సృష్టి అంతటికి మూలమైన వాడు.   రామాయణ కావ్యాన్ని   రచించమని వాల్మీకికి చెప్పినవాడు.

శ్రీ రాముడు - శ్రీ మహా విష్ణువు 7 వ అవతారము (కథానాయకుడు)

ధర్మస్వరూపము. ఒక మనిషి ఎలా జీవించాలో ప్రవర్తించి చూపించాడు. రావణ వధ  కోసం అవతరించాడు. 

సీతాదేవి  - శ్రీ మహాలక్ష్మి, విష్ణువు ను అనుసరించి రామావతార ప్రయోజనం కోసం సీతాదేవిగా జన్మించింది. (కథానాయిక)

భరతుడు - శ్రీ రాముని తర్వాత జన్మించిన కైకేయి కొడుకు

లక్ష్మణుడు - భరతుని తర్వాత పుట్టిన సుమిత్ర కొడుకు. శ్రీ రాముని ఎళ్లవేళలా వెంట ఉండేవాడు.

శత్రఘ్నుడు - దశరథుని 4వ కుమారుడు. తల్లి సుమిత్ర, లక్ష్మణుని కవల సోదరుడు. ఎప్పుడూ భరతునికి తోడుగా ఉండేవాడు.

దశరథుడు - శ్రీ రాముని తండ్రి

కౌసల్య - శ్రీ రాముని తల్లి

సుమిత్ర - లక్ష్మణ, శత్రఘ్నుల తల్లి

కైకేయి - భరతుడి తల్లి 

వసిష్ఠుడు - అయోధ్య రాజ గురువు

విశ్వామిత్రుడు - రామ, లక్ష్మణులకు సకల అస్త్రాలను అందించిన గురువు. వారి వివాహానికి కారణమైనవాడు.

 తాటకి - రాక్షసి, రామలక్ష్మణుల చేతిలో హతమైనది.

మారీచుడు – రాక్షసుడు - తాటక కొడుకు

సుబాహుడు - మరో రాక్షసుడు - తాటక కొడుకు

గౌతముడు - ఒక మహర్షి, అహల్య భర్త

అహల్య - గౌతముని భార్య.

జనకుడు - మిథిలానగర రాజు, సీతాదేవి, ఊర్మిళల తండ్రి

కుశధ్వజుడు - జనకుని తమ్ముడు, మాండవి శృతకీర్తుల తండ్రి

ఊర్మిళ - జనకుని మరో కుమార్తె, లక్ష్మణుని భార్య

మాండవి - కుశధ్వజుని కుమార్తె

శృతకీర్తి - కుశ ధ్వజుని మరో కుమార్తె

శతానందుడు - జనక మహారాజుని పురోహితుడు, గౌతముని కుమారుడు

పరశురాముడు - మహావిష్ణు ఆరవ అవతారము, జమదగ్ని మహర్షి కుమారుడు

 

ముందుగా...

 

శ్రీ వాల్మీకి, రామాయణంలో ఏ పాత్రగురించి తన అభిప్రాయము వ్యక్తీకరించడు. ఏ పాత్ర ఏ విధంగా ప్రవర్తించిందో వివరిస్తాడు. మనమే మంచి చెడులను విశ్లేషించి, ఆయా పాత్రల గుణగణాలను అర్థం చేసుకుంటాము.

రావణుని దురాగతాలవల్ల లోకులు పడే బాధలను తీర్చడానికి  శ్రీ మహా విష్ణువు శ్రీ రామునిగా అవతరించడం జరిగింది

 

ఈ కథా రామాయణము పిల్లలకు అర్థమయ్యేవిధంగా ఉండాలని రావణుని ముందు పరిచయము చేస్తున్నాను.

అసలు రావణుడు ఎవరు? రావణుని గుణగణాలు ఏమిటి? ఎందుకు శ్రీ రామావతార అవసరం ఏర్పడింది.

ఈ రోజుల్లో వివిధ మాధ్యమాల ద్వారా రామాయణంలో రావణుడు, భారతం లో దుర్యోధనుడు, కర్ణుడు అన్యాయంగా, అక్రమంగా చంపబడ్డారని మన పురాణాలను తప్పుగా చూపించడం జరిగింది, జరుగుతోంది.

 

మరి అసలు కథ ఏమిటి మనం మన పిల్లలకు చెప్పము. సినిమాలు, నెట్ లో అందుబాటులో వున్న అబద్దపు, సంకర సాహిత్యాలను చాలా మంది నమ్మి, పురాణాలను విశ్వసించలేని    పరిస్థితికి వచ్చారు.

ఈ ధోరణి మన సమాజానికి చాలా ప్రమాదకరమైనది. చిన్న తనంలో అసలు విషయాలను తెలుసుకొన గలిగితే...

గాంధీ, హోమీ భాభా , అబ్దుల్ కలాం ఎందుకు అంతగా పురాణాల గురించి చెప్పారో, వారు ఆ దారిలో ఎలా నడిచారో తెలుస్తుంది.

శ్రీ వాసుదాసులచే వ్రాయబడిన శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము మందరమును   అనుసరించి  కథా రామాయణాన్ని వివరించడము జరిగింది. శుద్ధ గ్రాంధికములో వంద   సంవత్సరాల   క్రితము వ్రాయబడిన  రామాయణం   శ్రీ వాల్మీకి రచించిన 24000 శ్లోకాల   సంస్కృత   రామాయణానికి యథాతథ అనువాదం.   శ్రీ వాల్మీకి రామయణాన్ని సంస్కృతం   నుండి తెలుగులోకి అనువదించేప్పుడు  శ్రీ వాసుదాసులుఎటువంటి మార్పులు చేర్పులు   చేయకుండా టీకా తాత్పర్య సహితంగా  లోకానికి అందచేశారు.

అదే రామాయణాన్ని శ్రీ వాసుదాసుల ప్రశిష్యులు మా తాతగారు దుర్గరాజు లక్ష్మీనారాయణ గారు   రోజూ రామాయణ పారాయణకు వీలుగా  తాత్పర్యం మాత్రమే విడిగా వ్రాసుకున్నారు.   దాని నుంచి నేను అతిసరళ వ్యావహారిక భాషలో ఇప్పటి తరానికి కూడా అర్థం అవాలని    ప్రయత్నం చేసాను. ఇప్పటి తరానికి రామాయణ   జ్ఞానాన్నిఅందివ్వాలనే   తపనతోనే తప్ప శ్రీ వాసుదాసుల ని కానీవారి అద్భుత కవిత్వపటిమను కానీ తక్కువ చేయడంలేదని,    నా భావాన్ని సరిగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.  ఆ పాండిత్యాన్ని అర్థం చేసుకునే  శక్తి ఈ తరంలో   ఏ కొద్దిమందికో వుండవచ్చు. అయితే రామానుగ్రహమున్న వాళ్ళకు మందరం చేరవచ్చు.  1920 నాటి గ్రాంధిక భాష అర్థము చేసుకోవటానికి భయపడి అసలు రామాయణము  చదవరేమోననే   అపోహతో     కథా రామాయణాన్ని అందిస్తున్నాను. శ్రీభాష్యం ఆప్పలాచార్య  స్వామి వారు   అన్నట్టు    కథా రామయణం - బాలకాండలో   ప్రత్యేకంగా ముఖ్యమైన మూడు   సంఘటనలనే గమనంలోకి   తీసుకున్నాను. 

 శ్రీరామ జననంయాగ సం రక్షణం,  శ్రీ సీతారామ కళ్యాణం ఒక వరుసలో వ్రాసిఇక   సందర్భానుసారం వచ్చే ఇతర కథలను విడిగా ఇస్తూమందరం ఆత్మ దెబ్బతినకుండా   వుంచే ప్రయత్నం   చే శాను. ప్రతి కాండ అయిపోయిన తరువాత   శ్రీ వాసుదాసులు   రచించిన సంక్షిప్త రామాయణాన్ని పిల్లలతో సహా అందరూ పారాయణ చేసుకోవడానికి   అందచే శాను.

శ్రీ వాసుదాసులకునాలో శ్రీరాముని పట్లశ్రీరామయణం పట్ల ఆసక్తికి కారణమైన, నాకు గురుతుల్యులునిత్య శ్రీరామాయణ పారాయణులు, ఈ కథలకు పుస్తక రూపమిచ్చేనందుకు ప్రేరణ అయిన శ్రీమాన్ డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారికిమా తాతగారు శ్రీ దుర్గరాజు లక్ష్మీనారాయణ గారికినా తల్లిదండ్రులు భారతిదేవిశ్రీ పాండురంగ విఠల్ గార్లకి,     మా  తాతగారు వ్రాసుకున్న తాత్పర్య రామాయణానికి ఏంతో శ్రమకోర్చి పుస్తక రూపమిచ్చిన        మా మేనత్త పద్మావతి గారి భర్త, మాకు ఎంతో ఆదరణీయులు, ప్రేమాస్పదులు మా మామయ్యగారు శ్రీ ఆత్మకూరి శ్రీమన్నారాయణ గారికినన్ను కన్న కొడుకులా ఆదరించిన మా మేనమామ                                        శ్రీ బసవరాజు గోపాలకిషన్ రావు(పెగళ్ళపాటి సీతారామ రావు) గారి  పాదాలకు నమస్కరిస్తూ..    

ఇక...

ఇంతకు ముందు చెప్పినట్టు రావణుడు రామాయణంలో ప్రతినాయకుడు. ఇతని వంశము, పుట్టుక మొదలైనవి కథలో ముందు ముందు తెలుస్తుంది. బ్రహ్మ దగ్గర నర వానరులు తప్ప దేవ, దానవ, యక్ష, కిన్నెర మొదలయిన అన్ని ప్రాణులనుండి మరణ భయము లేకుండా  వరాలు పొందాడు.     ఆ వరగర్వంతో దేవతలను జయించి, సోదరుడైన కుబేరుడి లంకా నగరాన్ని ఆక్రమించాడు.  యజ్ఞ యాగాదులను జరిపే మునులను హింసించేవాడు. స్త్రీలను చెరబట్టేవాడు. విపరీతమైన యుద్ధకాంక్షతో ముల్లోకాలను తన ఆదేశాలకు అనుగుణంగా నడవాలనేవాడు.

రావణుని బారినుంచి లోకాలను రక్షించమని దేవతలు, మునులు మొదలైనవాళ్లంతా  బ్రహ్మదేవుణ్ణి కలిసి రక్షించమని వేడుకుంటారు.

ఇక బ్రహ్మదేవునితో సహా అందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి వారిముందు ప్రత్యక్షమై నేను దశరథునికి నలుగురు కుమారులుగా జన్మించి పదకొండు వేల సంవత్సరాలు నరునిగా చరించి ధర్మ సంస్థాపన చేస్తాను. రావణ సంహారానికి మిగిలిన దేవతలు వారి వారి అంశలతో వానరులుగా జన్మించి రావణ సంహారంలో వారి పాత్ర వారు నిర్వహించమని చెప్పాడు.

 

సిద్ధి మంత్రం

నమోఽస్తు రామాయ సలక్ష్మణాయై
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై|
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోఽస్తు చన్ద్రార్క మరుద్గణేభ్యః

 

 

శ్రీ రామ జయమంత్రం

  జయ త్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః

  రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః

  దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః

  హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః

  న రావణ సహస్రం మే యద్ధే ప్రతిబలం భవేత్

  శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః

  అర్ధయిత్వా పురీం లంకా మభివాద్య చ మైథిలీం

  సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసామ్

  ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్యది

  పౌరుషే చాప్రతిద్వంద్వ శ్శరైనం జహి రావణిమ్ 

 

రామాయణం ఇలా మొదలయింది….


కథా రామాయణం - 3

  బాలకాండ                                                                                      (దశరథ మహారాజు)  విశ్వామిత్రుడు, రామలక్ష్మణుల ...