Tuesday, August 8, 2023

కథా రామాయణం - 1

 కథా రామాయణం

అందరు తాతలకు కథలడిగే మనవలుమనవరాళ్లు వుంటారు. వాళ్ళల్లో ఒకతి నా మనుమరాలు   సహస్రనా చిట్టితల్లికి చెప్పిన శ్రీరామ కథను మిగతా తాతల సౌకర్యార్థం...


ఓ రోజు బీరువాలో వున్న పుస్తకాలు అన్ని సర్దుతున్నాను. ఐదు సంవత్సరాల నా మనమరాలు  సహస్ర  నేను చేసేది చూస్తూ.

"ఈ బుక్స్ ఏంటి తాతా ఇంత లావుగా వున్నాయి, ఇన్ని వున్నాయి" అంది.

"ఇది రామాయణం" అన్నాను.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణ మందారాన్ని చూపిస్తూ. ఇది రామాయణం, ఇవి తొమ్మిది  పుస్తకాలు ఉంటాయి. మొత్తం ఆరు కాండలు అంటారు. దీనిని వాసుదాసు గారు వ్రాసారు.

"మీ ఆఫీసు వా" అన్నది.

కాదురా “రాముడు జేజ స్టోరీ” అన్నాను.

"స్టోరీ నా ఏమి స్టోరీ" అన్నది.

"మాన్స్టర్ ప్రిన్సెస్ ని ఎత్తుకు పోతాడు. ప్రిన్స్ మాన్స్టర్ చంపి ప్రిన్సెస్ ని సేవ్ చేసి తెచ్చుకుంటాడు". అని చెప్పాను.

''మరి ఇది'' అంది భాగవతాన్ని చూపిస్తూ

"ఇది లిటిల్ కృష్ణ స్టోరీ" అన్నాను.

అంతకు ముందు రోజే టీవీ లో లిటిల్ కృష్ణ యానిమేటెడ్ మూవీ చూశాము ఇద్దరమూ కలిసి.  దాన్లో చిన్ని కృష్ణుడి లీలలు ఆనందమూ ఆశ్చర్యము తో చూసింది.                "మరైతే ఈ స్టోరీస్ నాకు  చెప్పవా  తాతా" ప్లీజ్ అంది.

"రాత్రి పడుకున్నప్పుడు చెప్తాలే,యిపుడు పనిఉంది" అని ఆ పుస్తకాలన్నీ సర్దే పనిలో పడి పోయాను.


ఆ రాత్రి

"తాతా కథ చెప్పవా" అని నా మనుమరాలు సహస్ర నా దగ్గర పడుకొని నా చెంపమీద చేత్తో  రుద్దుతూ గారంగా అడిగింది.

"ఏ కథ చెప్పనూ" అంటే, మాన్స్టర్ కథ చెప్పు. మాన్స్టర్ ప్రిన్సెస్ ని ఎత్తుకు పోతుంది కదా            అది చెప్పు లేకపోతే లిటిల్ కృష్ణ స్టోరీ చెప్పు" అంది.  ఆ రోజు ఉదయం బుక్స్ విషయాన్ని గుర్తుచేస్తూ.

 

నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. మా నానమ్మ కమలమ్మ గారి దగ్గర పడుకొని విన్న రామాయణ,     భాగవత కథలు గుర్తొచ్చాయి. మా తాతగారు దుర్గరాజు లక్ష్మీనారాయణ గారు రోజూ రామాయణ పారాయణ  చేసుకొనే విషయం  గుర్తొచ్చింది.  రామాలయ ప్రతిష్ట,  ఆ ఆలయంలో రోజూ చేసే  రామ భజన అంతా ఓ ఫ్లాష్ బ్యాక్ లా కళ్ళముందు గిర్రున తిరిగాయి.

 

ఓహ్, మాది కదా అదృష్టం. మా తాత గారూ, నానమ్మ, మా నాన్న గారూ మా చిన్నప్పుడు మాకు  ఇలా రాత్రి పడుకునే ముందు కథలు చెప్పేవారు. మా పిల్లలు పుట్టి పెరిగి వచ్చే సమయానికి  పై ముగ్గురూ వెళ్లిపోవడం, మా అమ్మ అనారోగ్యం తో, మా నగర జీవితంతో మా పిల్లలు మన  పురాణ కథలు,  ఇతిహాసాల గురించి  వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవడమే కానీ మేమేమీ  చెప్పలేకపోయాము.  ఇప్పుడు నా మానమరాలుకి ఆ లోటు రాకూడదని ముందుగా  రామాయణం చెపుదామని నిర్ణయానికొచ్చాను.

 

చిరు కథా రామాయణం

బాలకాండ

"అయోధ్య" కు రాజు వయసులో పెద్ద వాడైన దశరథ మహారాజు. ఆయనకు ముగ్గురు భార్యలు.  కౌసల్య, సుమిత్ర, కైకేయి.


వాళ్లకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రఘ్నుడు అనే నలుగురు పిల్లలు.


ఓరోజు  వాళ్ళ దగ్గరకు విశ్వామిత్రుడు అనే ఋషి వచ్చి దశరథుడిని "రామ లక్ష్మణులను నాతో  పంపించండి, నేను చేస్తున్న యాగానికి వాళ్ళు రక్షణగా ఉండి రాక్షసులనుండి కాపాడుతారు"  అని అడిగాడు.

 

దశరథుడు ముందు రామ లక్ష్మణులు చిన్నవాళ్లు అని ఒప్పుకోకపోయినా వాళ్ళ గురువు    వశిష్ఠుడు  "రామ లక్ష్మణులకు మంచి జరుగుతుంది పంపండి" అంటే  పంపిస్తాడు.

 

రామ లక్ష్మణులను వెంటపెట్టుకొని విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్తోంటే దారిలో తాటకి  అనే రాక్షసి వాళ్ళని మింగటానికి  వస్తుంది. దాంతో రాముడు తాటకి ని చంపేస్తాడు. 

 

విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్లిన తర్వాత యాగం జరిగేటప్పుడు ఆశ్రమము మీదికి దాడికి  వచ్చిన రాక్షసులలో సుబాహుడు అనేవాడిని చంపేసి  మారీచుడుని దూరంగా పడేట్టు కొడతాడు.  విశ్వామిత్రుడు,   యాగం పూర్తి అయిన  తర్వాత రామలక్ష్మణులను వెంటపెట్టుకొని మిథిలా నగరానికి వెళ్తాడు.  దారిలో రాముడు ఓ చోట  భర్తకు దూరమైన  అహల్య అనే ఆమెను ఆమె భర్త  గౌతముని  దగ్గరకు చేరుస్తాడు.

 

మిథిలా నగరంలో శివధనస్సు విరచి స్వయంవరంలో సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు రాముడు.   లక్ష్మణునికి ఊర్మిళ,  భరతునికి మాండవిని, శత్రఘ్నునికి శృతకీర్తిని ఇచ్చి పెళ్లి చేస్తారు.

 

అందరు అయోధ్యకొచ్చి హాయిగా వుంటారు.

 

అయోధ్యకాండ 

 

అలా కొన్ని రోజులు గడిచాయి.

 

"ఆగు తాతా ఆగు" అంది నా మనుమరాలు సహస్ర.

 

“ఏంట్రా” అంటే.

"వయసులో పెద్దవాడైన దశరథుడికి అంత చిన్నపిల్లలేంటి?

రాముడు, లక్ష్మణుడు చిన్న వాళ్ళని తెలిసీ విశ్వామిత్రుడు వాళ్ళను అంత పెద్ద రాక్షసులు  వుండే దగ్గరకు ఎందుకు  తీసుకు పోయాడు?

పెద్ద రాక్షసులను చిన్న వాళ్ళైనా రామలక్ష్మణులు ఎలా ఓడించారు?

పెద్ద వాడైన విశ్వామిత్రుడు ఉన్నప్పుడు, అహల్యను ఆమె భర్త దగ్గరకు రాముడు పంపడమేంటి?

స్వయంవరమంటే ఏంటి?

శివధనస్సు విరగ్గొట్టటమెందుకు?

ఓకే, శివధనస్సు విరగ్గొడితే రాముడికి సీత కు పెళ్లి చేశారు. మరి ఏమీ విరగ్గొట్టకుండా మిగతా  ముగ్గురు పెళ్లిళ్లు ఎలా చేశారు?

అసలు రాముడు లక్ష్మణుడు ఇద్దరు మాత్రమే వెళితే, మరి భరతుడు శత్రఘ్నుడు ఎలా పెళ్ళికి  వచ్చారు?

డీటెయిల్స్ లేకుండా స్టోరీ చెప్పొద్దు  తాతా. క్లియర్ గా చెప్పవా?"

"ఓసి భడవా భలే అడిగావే, ఈ రోజుకి ఇంతే పడుకో".

రేపటి నుంచీ క్లియర్ గా చెపుతాను అన్నాను నేనో నిర్ణయానికి వస్తూ.

 

ముందు నేను రామాయణం చదివి దాని యథాతథ కథా రూపాన్ని నా మనుమరాలికి  చెపుదామనుకున్నాను.  మా ఇంట్లో వున్న శ్రీ వాసుదాస స్వామి వారి శ్రీ మదాంధ్ర వాల్మీకి  రామాయణం(మందరం) ను చదవాలని నిశ్చయించుకొని నా మనుమరాలికి  ఉపోద్ఘాతంగా రామాయణాన్ని ఈ విధంగా పరిచయం చేశాను.

 

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం

ఆరుహ్య కవితా శాఖామ్ వందే వాల్మీకి కోకిలమ్!


కథా రామాయణం


ఎవరు ఏ కథ వ్రాసినా కథానాయకుడు, ప్రతినాయకుడు వారి ఇద్దరికీ మద్దతుగా ఇతర  పాత్రలు ఉంటాయి.

ప్రతినాయకుడు అతి బలవంతుడు. మహా క్రూరుడు అయి ఉంటాడు.                                    బలహీనులను,          మంచి  వాళ్ళను ఏడిపించేవాడూ,  ఆడవాళ్లను చెరపట్టేవాడూ,   లోకాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునేవాడుగా ఉంటాడు.  ప్రతి వ్యక్తి లో  విరుద్ధ వ్యక్తిత్వము వున్నట్లే, ఒక్కోసారి మంచిగా వున్నట్టుగా  ఉంటాడు. అతడే రావణుడు.

(ఇప్పటి పిల్లలకు అర్ధమయ్యే భాషలో ప్రతినాయకుడంటే బాహుబలి లో భళ్లాల దేవుడు,  అవెంజర్స్ లో థానోస్, కే జి ఎఫ్ లో అధీర. రావణుడు వీళ్లకు కొన్ని వేల రెట్లు శక్తిమంతుడు,  అన్ని లోకాలనూ గెలవగలిగిన వాడు అన్న మాట.)

మరి కథానాయకుడు తల్లి తండ్రులు, గురువులంటే భక్తి, అన్నదమ్ములంటే ప్రేమ, స్త్రీల పట్ల  గౌరవం, సమాజమంటే బాధ్యత, విద్యా జ్ఞాన సంపన్నుడు, ఇచ్చినమాట తప్పకపోవడం, విరుద్ధ  భావాలు, విరుద్ధవ్యక్తిత్వాలు లేకుండా వుండడం,అందరిని సమంగా చూడడం, శత్రువులతో    కూడా పొగడ్తలు పొందేవాడు,  ఏ శక్తినైనా తన అపరిమిత శక్తితో భయం లేకుండా  ఎదిరించేవాడూ,ధర్మాన్ని పాటించేవాడు,  అధర్మాన్ని ఎదిరించేవాడు, మొదలు పెట్టిన పనిని  పూర్తి అయ్యేంత వరకు వదలనివాడు,  అందరికి  మార్గదర్శి, ఆదర్శప్రాయుడు,  అందంలో మగవారినికూడా  మోహింప చేయ గలిగేవాడూ, స్నేహితులకు ధైర్యమయ్యేవాడు,  శత్రువులకు మృత్యువయ్యేవాడు,  కష్టంలోనూ, సుఖంలోనూ ఒకే విధంగా ఉండేవాడు,  ఇన్నివున్నా వినయంగా ఉండేవాడు అయి  ఉండాలి. ఉన్నాడు. 

 

 ఆయనే మన శ్రీ రాముడు.

 

కథానాయకుడంటే సినిమాల్లో చూపించేవాడు కాదు.

మనకున్న ఒకే కథానాయకుడు మన శ్రీరాముడు. ఆయన భార్య సీతాదేవి మాత్రమే కథానాయకి.

వారి జీవితాల్లో జరిగిన కథే రామాయణం.

నా మనుమరాలి కోసం మొదలు పెట్టిన ఈ కథా రామాయణ సంకల్పం నిర్విఘ్నంగా  కొనసాగాలని  గణపతిని, సరస్వతిని శ్రీ రామచంద్రుని ప్రార్థిస్తూ...

  

విఘ్ననాయక ప్రార్థన

శుక్లాంబరధరమ్ విష్ణుం శశి వర్ణం చతుర్భుజమ్

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేII

 

భారతీ  ప్రార్థన

క్షోణి తలంబునన్  నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర

శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్

వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్II

 

హనుమత్ ప్రార్థన

మనోజవమ్ మారుత తుల్య వేగమ్

జితేంద్రియమ్ బుద్ధిమతామ్ వరిష్ఠమ్

వాతాత్మజమ్ వానర యూధ ముఖ్యం

శ్రీరామ దూతం శిరసా నమామిII

 

ఆంజనేయ మతిపాటలాననం

కాంచనాద్రి కమనీయ విగ్రహమ్ 

పారిజాత తరుమూల వాసినమ్

భావయామి పవమాన నందనం

 

శ్రీ రామచంద్ర ప్రార్థన

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘు కులాన్వయ రత్న దీపమ్

ఆజానుబాహు మరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామిII

 

వైదేహీ సహితం సురధృమతలే హైమే మహామంటపే

మధ్యే పుష్పకమాసనే, మణిమయే, వీరాసనే సుస్థితమ్

అగ్రేవాచయతి, ప్రభంజనసుతే తత్వం మునిభ్యం పరం

వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామంభజే శ్యామలమ్II

 

రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటనేను

నాకేమి భయంబు, చింతలికనేమిటి కేమి ఘటించినన్

రఘు స్వామిదె కీర్తి, సత్యమిది సత్యము నాకు బనేమటంచు

నేనీ మహనీయకీర్తివిని, నిన్నెర నమ్మితి జానకీపతీII

 

చరితం రఘనాధస్య శతకోటి ప్రవిస్తరమ్

ఏకైకమక్షరం ప్రోక్తం, మహాపాతక నాశనమ్II

 

బాలకాండ లోని పాత్రలు – పరిచయం

వాల్మీకి - శ్రీ రామాయణ రచయిత

నారదుడు - బ్రహ్మ కుమారుడు, రామాయణాన్ని వాల్మీకికి వినిపించిన వాడు.

బ్రహ్మ - సృష్టికర్త, పురాణం ఇతిహాసాల ప్రకారం ఈ సృష్టి అంతటికి మూలమైన వాడు.   రామాయణ కావ్యాన్ని   రచించమని వాల్మీకికి చెప్పినవాడు.

శ్రీ రాముడు - శ్రీ మహా విష్ణువు 7 వ అవతారము (కథానాయకుడు)

ధర్మస్వరూపము. ఒక మనిషి ఎలా జీవించాలో ప్రవర్తించి చూపించాడు. రావణ వధ  కోసం అవతరించాడు. 

సీతాదేవి  - శ్రీ మహాలక్ష్మి, విష్ణువు ను అనుసరించి రామావతార ప్రయోజనం కోసం సీతాదేవిగా జన్మించింది. (కథానాయిక)

భరతుడు - శ్రీ రాముని తర్వాత జన్మించిన కైకేయి కొడుకు

లక్ష్మణుడు - భరతుని తర్వాత పుట్టిన సుమిత్ర కొడుకు. శ్రీ రాముని ఎళ్లవేళలా వెంట ఉండేవాడు.

శత్రఘ్నుడు - దశరథుని 4వ కుమారుడు. తల్లి సుమిత్ర, లక్ష్మణుని కవల సోదరుడు. ఎప్పుడూ భరతునికి తోడుగా ఉండేవాడు.

దశరథుడు - శ్రీ రాముని తండ్రి

కౌసల్య - శ్రీ రాముని తల్లి

సుమిత్ర - లక్ష్మణ, శత్రఘ్నుల తల్లి

కైకేయి - భరతుడి తల్లి 

వసిష్ఠుడు - అయోధ్య రాజ గురువు

విశ్వామిత్రుడు - రామ, లక్ష్మణులకు సకల అస్త్రాలను అందించిన గురువు. వారి వివాహానికి కారణమైనవాడు.

 తాటకి - రాక్షసి, రామలక్ష్మణుల చేతిలో హతమైనది.

మారీచుడు – రాక్షసుడు - తాటక కొడుకు

సుబాహుడు - మరో రాక్షసుడు - తాటక కొడుకు

గౌతముడు - ఒక మహర్షి, అహల్య భర్త

అహల్య - గౌతముని భార్య.

జనకుడు - మిథిలానగర రాజు, సీతాదేవి, ఊర్మిళల తండ్రి

కుశధ్వజుడు - జనకుని తమ్ముడు, మాండవి శృతకీర్తుల తండ్రి

ఊర్మిళ - జనకుని మరో కుమార్తె, లక్ష్మణుని భార్య

మాండవి - కుశధ్వజుని కుమార్తె

శృతకీర్తి - కుశ ధ్వజుని మరో కుమార్తె

శతానందుడు - జనక మహారాజుని పురోహితుడు, గౌతముని కుమారుడు

పరశురాముడు - మహావిష్ణు ఆరవ అవతారము, జమదగ్ని మహర్షి కుమారుడు

 

ముందుగా...

 

శ్రీ వాల్మీకి, రామాయణంలో ఏ పాత్రగురించి తన అభిప్రాయము వ్యక్తీకరించడు. ఏ పాత్ర ఏ విధంగా ప్రవర్తించిందో వివరిస్తాడు. మనమే మంచి చెడులను విశ్లేషించి, ఆయా పాత్రల గుణగణాలను అర్థం చేసుకుంటాము.

రావణుని దురాగతాలవల్ల లోకులు పడే బాధలను తీర్చడానికి  శ్రీ మహా విష్ణువు శ్రీ రామునిగా అవతరించడం జరిగింది

 

ఈ కథా రామాయణము పిల్లలకు అర్థమయ్యేవిధంగా ఉండాలని రావణుని ముందు పరిచయము చేస్తున్నాను.

అసలు రావణుడు ఎవరు? రావణుని గుణగణాలు ఏమిటి? ఎందుకు శ్రీ రామావతార అవసరం ఏర్పడింది.

ఈ రోజుల్లో వివిధ మాధ్యమాల ద్వారా రామాయణంలో రావణుడు, భారతం లో దుర్యోధనుడు, కర్ణుడు అన్యాయంగా, అక్రమంగా చంపబడ్డారని మన పురాణాలను తప్పుగా చూపించడం జరిగింది, జరుగుతోంది.

 

మరి అసలు కథ ఏమిటి మనం మన పిల్లలకు చెప్పము. సినిమాలు, నెట్ లో అందుబాటులో వున్న అబద్దపు, సంకర సాహిత్యాలను చాలా మంది నమ్మి, పురాణాలను విశ్వసించలేని    పరిస్థితికి వచ్చారు.

ఈ ధోరణి మన సమాజానికి చాలా ప్రమాదకరమైనది. చిన్న తనంలో అసలు విషయాలను తెలుసుకొన గలిగితే...

గాంధీ, హోమీ భాభా , అబ్దుల్ కలాం ఎందుకు అంతగా పురాణాల గురించి చెప్పారో, వారు ఆ దారిలో ఎలా నడిచారో తెలుస్తుంది.

శ్రీ వాసుదాసులచే వ్రాయబడిన శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము మందరమును   అనుసరించి  కథా రామాయణాన్ని వివరించడము జరిగింది. శుద్ధ గ్రాంధికములో వంద   సంవత్సరాల   క్రితము వ్రాయబడిన  రామాయణం   శ్రీ వాల్మీకి రచించిన 24000 శ్లోకాల   సంస్కృత   రామాయణానికి యథాతథ అనువాదం.   శ్రీ వాల్మీకి రామయణాన్ని సంస్కృతం   నుండి తెలుగులోకి అనువదించేప్పుడు  శ్రీ వాసుదాసులుఎటువంటి మార్పులు చేర్పులు   చేయకుండా టీకా తాత్పర్య సహితంగా  లోకానికి అందచేశారు.

అదే రామాయణాన్ని శ్రీ వాసుదాసుల ప్రశిష్యులు మా తాతగారు దుర్గరాజు లక్ష్మీనారాయణ గారు   రోజూ రామాయణ పారాయణకు వీలుగా  తాత్పర్యం మాత్రమే విడిగా వ్రాసుకున్నారు.   దాని నుంచి నేను అతిసరళ వ్యావహారిక భాషలో ఇప్పటి తరానికి కూడా అర్థం అవాలని    ప్రయత్నం చేసాను. ఇప్పటి తరానికి రామాయణ   జ్ఞానాన్నిఅందివ్వాలనే   తపనతోనే తప్ప శ్రీ వాసుదాసుల ని కానీవారి అద్భుత కవిత్వపటిమను కానీ తక్కువ చేయడంలేదని,    నా భావాన్ని సరిగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.  ఆ పాండిత్యాన్ని అర్థం చేసుకునే  శక్తి ఈ తరంలో   ఏ కొద్దిమందికో వుండవచ్చు. అయితే రామానుగ్రహమున్న వాళ్ళకు మందరం చేరవచ్చు.  1920 నాటి గ్రాంధిక భాష అర్థము చేసుకోవటానికి భయపడి అసలు రామాయణము  చదవరేమోననే   అపోహతో     కథా రామాయణాన్ని అందిస్తున్నాను. శ్రీభాష్యం ఆప్పలాచార్య  స్వామి వారు   అన్నట్టు    కథా రామయణం - బాలకాండలో   ప్రత్యేకంగా ముఖ్యమైన మూడు   సంఘటనలనే గమనంలోకి   తీసుకున్నాను. 

 శ్రీరామ జననంయాగ సం రక్షణం,  శ్రీ సీతారామ కళ్యాణం ఒక వరుసలో వ్రాసిఇక   సందర్భానుసారం వచ్చే ఇతర కథలను విడిగా ఇస్తూమందరం ఆత్మ దెబ్బతినకుండా   వుంచే ప్రయత్నం   చే శాను. ప్రతి కాండ అయిపోయిన తరువాత   శ్రీ వాసుదాసులు   రచించిన సంక్షిప్త రామాయణాన్ని పిల్లలతో సహా అందరూ పారాయణ చేసుకోవడానికి   అందచే శాను.

శ్రీ వాసుదాసులకునాలో శ్రీరాముని పట్లశ్రీరామయణం పట్ల ఆసక్తికి కారణమైన, నాకు గురుతుల్యులునిత్య శ్రీరామాయణ పారాయణులు, ఈ కథలకు పుస్తక రూపమిచ్చేనందుకు ప్రేరణ అయిన శ్రీమాన్ డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారికిమా తాతగారు శ్రీ దుర్గరాజు లక్ష్మీనారాయణ గారికినా తల్లిదండ్రులు భారతిదేవిశ్రీ పాండురంగ విఠల్ గార్లకి,     మా  తాతగారు వ్రాసుకున్న తాత్పర్య రామాయణానికి ఏంతో శ్రమకోర్చి పుస్తక రూపమిచ్చిన        మా మేనత్త పద్మావతి గారి భర్త, మాకు ఎంతో ఆదరణీయులు, ప్రేమాస్పదులు మా మామయ్యగారు శ్రీ ఆత్మకూరి శ్రీమన్నారాయణ గారికినన్ను కన్న కొడుకులా ఆదరించిన మా మేనమామ                                        శ్రీ బసవరాజు గోపాలకిషన్ రావు(పెగళ్ళపాటి సీతారామ రావు) గారి  పాదాలకు నమస్కరిస్తూ..    

ఇక...

ఇంతకు ముందు చెప్పినట్టు రావణుడు రామాయణంలో ప్రతినాయకుడు. ఇతని వంశము, పుట్టుక మొదలైనవి కథలో ముందు ముందు తెలుస్తుంది. బ్రహ్మ దగ్గర నర వానరులు తప్ప దేవ, దానవ, యక్ష, కిన్నెర మొదలయిన అన్ని ప్రాణులనుండి మరణ భయము లేకుండా  వరాలు పొందాడు.     ఆ వరగర్వంతో దేవతలను జయించి, సోదరుడైన కుబేరుడి లంకా నగరాన్ని ఆక్రమించాడు.  యజ్ఞ యాగాదులను జరిపే మునులను హింసించేవాడు. స్త్రీలను చెరబట్టేవాడు. విపరీతమైన యుద్ధకాంక్షతో ముల్లోకాలను తన ఆదేశాలకు అనుగుణంగా నడవాలనేవాడు.

రావణుని బారినుంచి లోకాలను రక్షించమని దేవతలు, మునులు మొదలైనవాళ్లంతా  బ్రహ్మదేవుణ్ణి కలిసి రక్షించమని వేడుకుంటారు.

ఇక బ్రహ్మదేవునితో సహా అందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి వారిముందు ప్రత్యక్షమై నేను దశరథునికి నలుగురు కుమారులుగా జన్మించి పదకొండు వేల సంవత్సరాలు నరునిగా చరించి ధర్మ సంస్థాపన చేస్తాను. రావణ సంహారానికి మిగిలిన దేవతలు వారి వారి అంశలతో వానరులుగా జన్మించి రావణ సంహారంలో వారి పాత్ర వారు నిర్వహించమని చెప్పాడు.

 

సిద్ధి మంత్రం

నమోఽస్తు రామాయ సలక్ష్మణాయై
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై|
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోఽస్తు చన్ద్రార్క మరుద్గణేభ్యః

 

 

శ్రీ రామ జయమంత్రం

  జయ త్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః

  రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః

  దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః

  హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః

  న రావణ సహస్రం మే యద్ధే ప్రతిబలం భవేత్

  శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః

  అర్ధయిత్వా పురీం లంకా మభివాద్య చ మైథిలీం

  సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసామ్

  ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్యది

  పౌరుషే చాప్రతిద్వంద్వ శ్శరైనం జహి రావణిమ్ 

 

రామాయణం ఇలా మొదలయింది….


కథా రామాయణం - 3

  బాలకాండ                                                                                      (దశరథ మహారాజు)  విశ్వామిత్రుడు, రామలక్ష్మణుల ...