Wednesday, August 9, 2023

కథా రామాయణం - 2

                                                                 బాలకాండ


      (వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడు )   
                                                                          

ఓరోజు వాల్మీకి మహాఋషి ఆశ్రమానికి  నారదుడు వచ్చాడు.

వాల్మీకి నారదునికి నమస్కరించి కుశల ప్రశ్నలు వేసి, అతిథి మర్యాదలు చేసాడు.

కొంతసేపాగి వాల్మీకి నారదుణ్ణి ఇలా అడిగాడు.

"మహానుభావా ఈ లోకంలో ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడేవాడు, ధర్మం  తప్పని  వాడూ, మంచి కోసం చెడుని ఎదిరించి గెలిచేవాడూ,  ఉత్తమమైన  గుణములు వున్నవాడూ,  మహా వీరుడూ,  చూసేకొద్దీ చూడాలనిపించే అంత అందమైన వాడూ మొదలయిన గొప్ప                   లక్షణాలున్నవాడు ఎవరైనా ఈ లోకంలో వున్నాడా" అని అడిగాడు. 

  "ఉన్నాడయ్యా వాల్మీకీ, ఆయన శ్రీరామచంద్రుడు. అయోధ్య మహారాజు" అని  శ్రీరాముడు పుట్టుక నుంచి పట్టాభిషేకం వరకూ జరిగింది చెప్పి వెళ్లి పోయాడు.

తరువాత తమసా నదికి స్నానం చేయడానికి వెళ్లి అక్కడ పక్షులను వేటాడే ఒక బోయవాడు  జంటగా ఉన్న రెండు పక్షులలో మగపక్షినిబాణమేసి చంపాడు. మిగిలిన ఆడ పక్షి ఏడుస్తూ  ఆ చనిపోయిన పక్షి చుట్టును తిరుగుతూ ఏడుస్తోంది.                                            అది చూసిన వాల్మీకి కోపంతో ఆ బోయవాడిని ఇలా శపించాడు.

                                                                                                                                                                          (కోపంతో వాల్మీకి) 

 "మానిషాద ప్రతిష్ఠాం త్వం ఆగమః శాశ్వతీః సమాః ।

యత్ క్రౌంచమిథునాదేకం అవధీః కామమోహితః ॥"


"కిరాతకుడా! పక్షిజంటలో ఒకదానిని చంపి, నీవు శాశ్వతంగా చెడ్డవాడివయ్యావు"   అన్నాడు, వాడు భయపడి పారిపోయాడు.

ఆశ్రమానికి వచ్చిన వాల్మీకి నేను ఎందుకిలా అన్నాను. ఎందుకింత బాధగా మాట్లాడాను.

అని ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ, దేవతలతో కలసి వచ్చాడు.


             (బ్రహ్మ రామకథను వ్రాయమని వాల్మీకికి చెప్పుట)

బ్రహ్మ వాల్మీకితో "వాల్మీకీ, బాధపడకు. నువ్వు తప్పు చేయలేదు. నీ నోటిలోంచి వచ్చిన  శ్లోకం మాదిరిగానే రామకథలో జంటను వేరు చేసిన వాడు నశించాడు కథ రచన చేసి,  లోకానికి అందచెయ్యి. నీ బాధ కూడా తగ్గిపోతుంది"  అని చెప్పాడు.

‘‘నా అనుగ్రహంతో రామకథలోని ఎవరెవరు  ఏఏ పనులు చేసిందీ,                                             వారేం మాట్లాడిందీ, ఎలా ఆలోచించిందీ అన్నీ నీ దివ్యదృష్టికి తెలుస్తాయి.                                        నువ్వు రచించిన   శ్రీ రామకథఈ లోకం అంతటా వ్యాపించి, పర్వతాలూ,  సముద్రాలూ, సూర్య చంద్రులూ  ఉన్నంతకాలం  ఉంటుంది" అని ఆశీర్వదించి 

వెళ్ళిపోయాడు.

(వాల్మీకి, రామాయణ రచన)

వాల్మీకి రామకథను పూర్తి చేశాడు. ఈకథ పాడుకోవడానికి వీలుగా కూడా ఉంది.      ఆయన ఆశ్రమంలోనే ఉన్న లవ కుశలకు ఈ కథను నేర్పి,లోకంలో ప్రచారం                 చెయ్యమని   పంపాడు.

లవకుశులు ఇద్దరూ రామకథ పాడుకుంటూ అయోధ్య చేరారు. అయోధ్యలో జనమంతా  మైమరచిపోయి రామకథను వింటున్నారు. అది విని శ్రీ రాముడు లవకుశులను సభకు  పిలిపించి శ్రీ రామకథను అందరితో కలసి కింద కూర్చుని తన్మయత్నంతో వింటున్నాడు.             లవకుశులు రామకథ మధురంగా వినిపిస్తున్నారు.


శ్రీరామ జననం

                                                                     (అయోధ్య)  

అయోధ్య చాల గొప్ప నగరం. కోసలకు రాజధాని.  రాజు పేరు దశరథుడు.

ఆయనకు ముగ్గురు భార్యలు.   కౌసల్య, సుమిత్ర, కైకేయి.

దశరథ మాహారాజు ముసలి వాడయ్యాడు.  అరవై వేలవ పుట్టినరోజుకూడా అయిపోయింది.

ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆరోజు వారి రాజగురువు వసిష్ఠ మహాఋషిని కలిసి              "నేను ముసలి    వాడినయ్యాను. ఇంతవరకూ పిల్లలు పుట్టలేదు.  నాకు ఓపిక తగ్గిపోతోంది. ఏదైనా పూజ చేస్తే దేవుడు దయతలచి పిల్లలు కలగటానికి  దారి చూపుతాడేమో చెప్పండి" అన్నాడు. 

దానికి వసిష్ఠుడు "సరే రాజా, పుత్రకామేష్ఠి అని ఒక యాగము చేద్దాం. మీ కోరిక తీరుతుంది.  ఆయాగం చేయించడానికి ఋష్యశృంగుడు అనే ఒక గొప్ప ఋషి సహాయం తీసుకుందాం".    అన్నాడు.

పుత్రకామేష్ఠి యాగము అంటే, పుత్రులు అంటే పిల్లలు కావాలని చేసే ఒక యాగము.

 "తాతా" అంది నా మనుమరాలు.

"ఏమ్మా మళ్ళీ ఏమిటి" అన్నాను.

"ఎందుకంత పెద్ద పూజ అదే యాగం". అని అడిగింది.

ఎందుకంటే అందరి పూజలు అందుకునే వాడూ, అందరికి దిక్కైన వాడూ, అన్నిటికన్నా  గొప్పవాడూ అయిన శ్రీమహావిష్ణువు మనిషిగా దశరథుడికి పుడతానని, రావణాసురుడిని  చంపుతానని, లోకాలకు రక్షగా ఉంటానని అంతకుముందు దేవతలకు వరమిచ్చాడు.  మరి ఆయన పుట్టాలంటే ఎంతో పుణ్యము, ఎన్నో పూజలు చేయాలి మరి.

సరే నువ్విలా ప్రతిసారి అడ్డం తగలొద్దు. దీన్ని బాలకాండ అంటారని చెప్పా కదా.  ఇది చెప్పటం అయిపోయిన తర్వాత నీ డౌట్లు  అడుగు. నేను క్లియర్ చేస్తా. ఇంకోటి,  అన్ని కాండలకు ఇంతే మరి. మధ్యలో డిస్టర్బ్ చెయ్యొద్దు. అని తిరిగి కథలోకి వెళ్లిపోయాను.

అలా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తున్నాడు. అంతలో ఆ యజ్ఞగుండం మధ్యలో   ఒక పేద్ధ ఆకారం తో యాగ పురుషుడు బంగారుగిన్నెతో  ప్రత్యక్షమై,  దశరథ మహారాజా  దీనిలోని పాయసాన్ని మీ భార్యలకు పంచు. నీకు అంతా మంచి జరుగుతుంది అని,  ఆ పాయసాన్ని దశరథునికి ఇచ్చి మాయమైపోయాడు.

దశరథుడు ఆనందంతో ఆ పాయసంలో సగం పెద్ద భార్య అయిన కౌసల్యకు,  మిగిలినదానిలో  సగం సుమిత్రకు, ఆ మిగిలిన దాంట్లో సగం కైకేయికి ఇచ్చి,   చేతిలో మిగిలిన నాలుగవ భాగాన్ని  మళ్ళీ సుమిత్రకు రెండవసారి ఇచ్చాడు.

కొన్ని నెలలకు మొదటి సగం పాయసం తీసుకున్న కౌసల్యకు శ్రీ రాముడు,           మూడవ భాగము  తీసుకున్న కైకేయికి భరతుడు, రెండవ నాల్గవ భాగాలను తిన్న  సుమిత్రకు లక్ష్మణ,  శత్రుఘ్నులు కవలలుగా పుట్టారు.

శ్రీ రాముడితో లక్ష్మణుడు, భరతునితో శత్రుఘ్నుడు ఒక జట్టుగా వుండే వాళ్ళు.

రాముని వదిలి లక్ష్మణుడు ఒక్క క్షణమైనా ఉండేవాడు కాదు. అన్నకు తోడుగా  లక్ష్మణుడు ఎప్పుడూ వెంటనే ఉండేవాడు.

             (రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు )

అన్నదమ్ములు నలుగురూ గురువు గారు వశిష్ఠుని దగ్గర చదువుకుంటున్నారు.

పన్నెండు సంవత్సరాలు గడిచాయి....



 

కథా రామాయణం - 3

  బాలకాండ                                                                                      (దశరథ మహారాజు)  విశ్వామిత్రుడు, రామలక్ష్మణుల ...