విక్రమార్కుని సాహసాలు 😃
(సహస్రకు కథలు చెపుతున్న తాత)
ఆ రాత్రి ఎప్పటిలానే సహస్ర 'తాతా కథ చెప్పవూ' అంటూ పక్కలో దూరింది.
ఏ కథ చెప్పనూ అని అడిగాను.
హ్యారీ పోటర్ స్టోరీ చెప్పు అంది.
దాని మాటలకు నవ్వుతూ హ్యారీ పోటర్ స్టోరీ ఏంటి దానికన్నా గొప్ప గొప్ప కథలు ఎన్నో ఉన్నాయి మన వాఙ్మయంలో అనుకున్నాను.
రామాయణ, భారత, భాగవతాలు, అష్టాదశ పురాణాలలో ఎన్నో కథలు. అవే కాకుండా పిల్లలకు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించి తెలివితేటలు పెంచే ఎన్నో కథలు ఇప్పటి తరాలకు అందకుండా మరుగున పడిపోతున్నాయి కదా అనుకున్నా.
పేదరాశి పెద్దమ్మ కథలు, జాతక కథలు, కాశీ మజిలీ కథలు, కాంభోజ రాజు కథలు, భట్టి, విక్రమార్క కథలు, పంచతంత్ర కథలు, హాలుని గాథాసప్తశతి, హాస్యంగా ఉండే మర్యాదరామన్న, తెనాలి రామకృష్ణ, పరమానందయ్య శిష్యుల కథలు, సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి, బాల నాగమ్మ ఇలా ఎన్ని, ఎన్నెన్ని లెక్కలేనంత సాహిత్యం.
తాతా కథ అంటూ నన్ను కుదుపుతున్న నా మనవరాలు మాటలతో ఈ లోకంలోకి వచ్చా.
సరే మరి నేను నీకు చాలా ఎక్సైటింగ్ గాఉండే భట్టి, విక్రమార్క కథలు చెప్తాను, ఓకె నా అన్నా.
సహస్రకు ఏదైనా చెపితే దాని ప్రశ్నలకు జవాబులు చెప్పే ఓపిక ఉండాలి. అసలు ఈ భట్టి, విక్రమార్కులు ఎవరు. ఈ స్టోరీ ఎవరు రాశారు. నీకు ఎవరు చెప్పారు. అని అడిగింది.
దానికి నేను ఈ స్టోరీని నా చిన్నప్పుడు మా స్కూల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో చదివాను.
కాశ్మీర రాజ్యంలో బిల్హణుడు అనే కవి ఉండేవాడు. అతను ఆ దేశపు రాజైన మదనాభిరాముడి కూతురు యామిని పూర్ణ తిలక ను ప్రేమిస్తాడు. అయితే రాజుకు ఇది ఇష్టం లేక అతన్ని జైలులో పెడతాడు. అతను జైలు లోనే 'చౌరపంచశిఖ' అనే కావ్యం రాశాడు. రాజు దాన్ని చదివి ఇంత గొప్పవాణ్ణి ఇలా జైలు లో ఉంచకూడదు అని అతన్ని విడిచి పెడతాడు. తర్వాత బిల్హణుడు అవమానంతో కాశ్మీర రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేశ దేశాలు తిరుగుతూ చాళుక్య రాజైన విక్రమాదిత్యుని వద్దకు చేరాడు. ఆయన బిల్హణుడి పాండిత్యానికి మెచ్చి ఒక విద్యాలయానికి అధిపతిని చేశాడు. ఆ సమయంలోనే ఆయన సంస్కృత భాషలో విక్రమార్కదేవ చరిత్రను రాశాడు. దాన్ని జక్కన మహాకవి తెలుగులోకి మార్చి రాశాడు.
అబ్బా స్టోరీ చెప్పమంటే ఏదో అర్థం కాకుండా చెప్తున్నావు అంది సహస్ర.
అది నిజమేగా ఇవన్నీ ఈ చిన్న పిల్లకి ఎలా అర్థం అవుతాయి అనుకుంటూ
సరే స్టోరీ చెప్తా అంటూ విక్రమార్క కథలు చెప్పటం మొదలెట్టా.
అనగనగా ఒక రాజు
ఆయనది మాళవ రాజ్యం. రాజధాని ధారా నగరం. రాజు పేరు భోజుడు. ఆయన చాలా గొప్పవాడు, మంచివాడు. ఆయన ప్రజలను చాలా ప్రేమగా చూసేవాడు. ప్రజలందరికీ మంచి సౌకర్యాలను కల్పించాడు. ఆ రాజ్యంలో నేరాలు ఉండేవి కావు. అందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండేవారు.
అప్పట్లో అడవి ఎక్కువగా ఉండేది కదా. దాంతో సహజంగా జంతువులు కూడా ఎక్కువగా ఉండేవి. కొన్ని సార్లు వాటి జనాభా పెరిగి పోయి, దగ్గరలో ఉన్న గ్రామాల మీద పడి పంటలు పాడు చేయడం, పశువులను, మనుషులను చంపి తినటం చేసేవి. ఒకసారి అడవి జంతువులు గ్రామాల మీద దాడి చేశాయి.
వాటి వల్ల ఇబ్బందులు పడలేక అడవి దగ్గరలోని గ్రామాల జనం రాజు గారితో మమ్మల్ని ఈ జంతువుల బారి నుండి కాపాడండి అని మొర పెట్టుకున్నారు.
రాజుకు ప్రజలను కాపాడటానికి, అడవి జంతువులను వేటాడి చంపటం ఓ బాధ్యత.
తర్వాత భోజరాజు తన పరివారం, మంత్రులతో పాటు కొంత సైన్యాన్ని వెంటపెట్టుకొని వేటకు వెళ్ళి కొన్ని రోజులపాటు పులులు, సింహాలు మొదలైన క్రూరమృగాలను చంపి అడవి దగ్గరలో ఉండే ప్రజలకు ధైర్యం చెప్పి తిరిగి రాజధానికి బయలుదేరాడు.
వేటకు అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు పట్టింది. తీసుకెళ్లిన ఆహారం అయిపోయింది.
భోజరాజు పరివారం అంతా దారిలో ఎవరైనా భోజనం పెడతారేమో అని ఆశగా చూస్తూ వెళ్తున్నారు. ఇంక ఒకరోజు పైగా ప్రయాణం ఉంది. అందరికీ ఆకలిగా ఉంది.
అలా వెళ్తున్న దారిలో ఏపుగా పెరిగిన ఒక జొన్నచేను కనిపించింది. బాగా పాలు పోసుకుని గాలికి ఊగుతున్న కంకులతో చాలా నిండుగా ఉంది.
(భోజరాజ పరివారం)
(రాజసైన్యాన్ని చూస్తున్న రైతు)
ఆ పొలం మధ్యలో ఒక మంచె మీద దాని యజమాని కూర్చుని ఉన్నాడు. అతని పేరు రామశర్మ.
ఆయన మంచె మీదనుంచి పొలంపక్కగా నీరసంగా వెళ్తున్న ఈ జనాన్ని చూశాడు. అయ్యో అందరూ ఎంత ఆకలిగా ఉన్నారో, నడవడానికి కూడా కష్టపడుతున్నారు అనుకుంటూ అతను
రాజ పరివారంతో ఇలా అన్నాడు.
అయ్యా మీరంతా ఎంతో ఆకలిగా ఉన్నట్టుగా ఉన్నారు. నా ఈ పంటతో మీ ఆకలి తీర్చుకోండి. అని అన్నాడు.
దాంతో వేటకు వెళ్లిన వాళ్ళంతా సంతోషంతో జొన్నకంకులను కోసి వేడిగా మంటలో కాల్చి వాటి నుండి లేత జొన్నలను వేరు చేసి హాయిగా తింటున్నారు. ఈ లోపు బ్రాహ్మణుడు మీకు తాగటానికి నీళ్ళు ఇస్తాను అని మంచె మీదనుంచి కిందికి దిగి వీళ్ళ దగ్గరికి వచ్చాడు.
వాళ్ళ దగ్గరికి వస్తూనే విపరీతమైన కోపంతో వాళ్ళు తింటున్న వాటిని లాక్కుని, దారి పక్కన ఉన్నంత మాత్రాన ఇలా పొలాలను నాశనం చేస్తారా. మహారాజు దగ్గర ఉండి ఇలా తప్పు ఎలా చేయిస్తారు అని శోకాలు పెట్టాడు.
అది చూసి ఆశ్చర్యపోయిన సైన్యం, భోజరాజు ఆజ్ఞ మేరకు ఆ పంట చేను వదిలి వెళ్ళడం మొదలెట్టారు.
ఆ రైతు హమ్మయ్య అని అనుకుంటూ మళ్ళీ మంచె ఎక్కాడు.
ఆ రామశర్మ మంచె ఎక్కాక దాని మీదనుంచి చేను వదిలి వెళ్తున్న రాజ పరివారాన్ని చూశాడు.
అప్పుడు వాళ్లతో ఇలా అన్నాడు. అయ్యా
అదేమిటి తినకుండా ఆకలితో వెళ్తున్నారు. మీరు మొహమాట పడకుండా కడుపునిండా తిని వెళ్ళండి. నేను మీకు మంచి నీళ్లు అందిస్తాను అంటూ మళ్ళి మంచె దిగాడు.
దిగాగానే మళ్లీ ఇందాకటిలానే నా పొలం పాడు చేస్తున్నారంటూ గోల చేయటం మొదలెట్టాడు.
ఇది చూసిన ఆ రాజు, ఆయన మనుషులు ఆశ్చర్యపోయి వీడొక పిచ్చివాడు. మనకెందుకులే సమయం మించకుండా వెళ్లిపోవడం మంచిది. అని చేలో నుంచి బయటకు వస్తున్నారు.
వీళ్ళు వెళ్లిపోతున్నారు అనుకొని మళ్ళీ మంచె ఎక్కిన రామశర్మ, అయ్యలారా అలా తినకుండా ఆకలితో వెళ్లి నాకు పాపం అంటిస్తారా? హాయిగా తిని కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్నాడు మళ్ళీ.
దాంతో భోజరాజుకి విపరీతమైన కోపం వచ్చింది. ఏమిటి ఆటలాడుతున్నావు. వీణ్ణి బంధించి కారాగారం లో వేయండి అన్నాడు. దానికి ఆ రామశర్మ మంచె పై నుండి మాట్లాడుతూ మహారాజా మీకు ఆహారం అందించటం నా ధర్మం. ధర్మ కార్యం చేస్తుంటే నాకు శిక్ష వేస్తారా అని ఏడుపు మొదలు పెట్టాడు.
అప్పుడు భోజుని వెంటవున్న వరాహమిహిరుడు అనే గురువు రాజుతో మహారాజా 'ఇది అతని తప్పు అనిపించటం లేదు. అతను మంచె మీద ఉన్నప్పుడు ఆదరంగా, దిగినప్పుడు స్వార్థంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ మంచె మీదకానీ, దానికింద ఉన్న భూమిలో కానీ ఏదో అద్భుతం ఉందనిపిస్తోంది. ఆ విచిత్రం ఏమిటో తెలియాలంటే ఈ భూమిని మనం స్వాధీనం చేసుకోవాలి' అన్నాడు.
భోజరాజుకు కూడ ఆశ్చర్యంగా ఉంది. ఆ వింత ఏమిటో చూడాలని అనుకుని, రైతు రామశర్మను పిలిచి మంచి ధరను నిర్ణయించి దాని ప్రకారం ధనాన్ని ఇచ్చి ఆ పంట భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
తర్వాత మంచెను పరిశీలించారు. దానిలో ఏ తేడా కనపడలేదు. ఇక మంచె తొలిగించి కింద మట్టి లో
ఏమయినా ఉందేమో చూద్దామని నిర్ణయానికి వచ్చారు.
ఈ లోపు కొంతమంది జొన్నచేను లో ఆహారం ఏర్పాటు చేశారు. అంతా ఆహారం తీసుకున్న తర్వాత మంచె కింద తవ్వడం మొదలెట్టారు.
పొద్దుకుంకే సమయానికి మంచె కింద తవ్వే భూమిలోంచి కళ్ళు మిరిమిట్లు గొలిపే విపరీతమయిన కాంతి వచ్చింది. అందరూ మట్టిని తొలిగించి విచిత్రానికి కారణమైన వస్తువుని అతి కష్టంతో పైకి తెచ్చారు.
(బంగారు సింహాసనం, సాలభంజికలు)
అది ఒక బంగారు సింహాసనం. దానికి పదహారు మెట్లు ఉన్నాయి. ప్రతీ మెట్టు మీదా బంగారు బొమ్మలు రెండు ఉన్నాయి. దాన్ని సాలభంజిక అంటారు. అలా పదహారు మెట్లపైనా ముప్పయి రెండు సాలభంజికలు ఉన్నాయి. మొదటి మెట్టుపై కుడిచేతి పక్కన ఒక బొమ్మ ఉంటే, ఎడమ చేతి పక్కన ఇంకో బొమ్మ ఉంది. అలా పదహారు సాల భంజికలు కుడివైపు ఇంకో పదహారు ఎడమవైపు ఉన్నాయి.
మహారాజు అబ్బుర పడ్డాడు. ఆ సింహాసనాన్ని జాగ్రత్తగా ధారా నగరానికి చేర్చారు.
భోజరాజు అది ఎవరిదో తెలుసుకుందామని ఎంతో ప్రయత్నించాడు. కానీ ఎవరూ చెప్పలేక పోయారు. కానీ ఆది వచ్చిన తరువాత భోజరాజుకి ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపించింది. శతృరాజులు వాళ్ళంతట వాళ్ళే శాంతి సందేశాలు పంపారు.
రాజ్యం అంతా ఉల్లాసంగా ఉన్నది.
ఈ మార్పులు గమనించిన రాజు ఇదంతా ఆ సింహాసనం మహిమ. దాని మీద కూర్చుని రాజ్య పాలన చేస్తే ఇంకా బాగుంటుందని తాను రోజూ కూర్చునే సింహాసనాన్ని మార్చి దాని స్థలంలో ఈ బంగారు సింహాసనాన్ని వేయించాడు. దానికి, దానిపైనున్న సాలభంజికలకు పూజలు చేశారు. బ్రహ్మాండంగా అలంకరించారు.
ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతుండగా, కన్నెపిల్లలు పూలు చల్లుతుండగా, మంగళ వాయిద్యాల ఘోషలో భోజరాజు సింహాసనం వద్దకు వెళ్ళి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు.
కాదు కాదు కాలు పెట్టాను అనుకున్నాడు.
అప్పుడు ఒక విచిత్రం జరిగింది. సింహాసనం వెనక్కి జరిగినట్లు అనిపించింది. కానీ ఆది అక్కడే ఉంది. రాజు మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ అలాగే జరిగింది. దానితో పాటుగా ఆ సింహాసనం మెట్ల పైన ఉన్న ముప్పైరెండు సాలభంజికలు ఒక్కసారిగా గొల్లున నవ్వటం మొదలెట్టాయి.
(సాలభంజికలు)
చూశారటే ఎంత విచిత్రం రాజు ఎవరో ఈ సింహాసనాన్ని అధిష్టించటానికి ప్రయత్నిస్తున్నాడు చూడండి. అంటూ మళ్లీ నవ్వడం మొదలెట్టాయి. మహారాజ సభ అంతా నవ్వులతో ప్రతిధ్వనిస్తోంది. సభలో జనమంతా ఆశ్చర్యంతో కదలకుండా ఉండిపోయారు. భోజరాజు, మంత్రులతో సహా నిశ్చేష్టులయ్యారు.
ఇంకావుంది
మిగతా వచ్చేవారం...