బాలకాండ
(దశరథ మహారాజు)విశ్వామిత్రుడు, రామలక్ష్మణుల సిద్ధాశ్రమ ప్రయాణం!
ఒక రోజు దశరథ మహారాజు సభకు విశ్వామిత్ర మహర్షి వచ్చాడు.
దశరథుడు ఆయన్ని గౌరవించి, కుశల ప్రశ్నలు వేసి మీరు ఎందుకు వచ్చారు? మీకేమి కావాలో చెప్పండి. చేస్తాను అన్నాడు.
విశ్వామిత్రుడు సంతోషంతో “దశరథ మహారాజా, నేను చేసే యాగాన్ని రావణ అనుచరులైన రాక్షసులు మారీచ, సుబాహులు పూర్తి చేయనివ్వడం లేదు. రక్త మాంసాలతో మా ఆశ్రమాన్ని, యాగాన్ని అపవిత్రం చేస్తున్నారు. నేను వాళ్ళను చంపగలను కానీ, యాగం చేసేప్పుడు అలా చెయ్యకూడదు.
అందుకని రామ లక్ష్మణులను యాగాన్ని కాపాడటానికి పంపు” అని అడిగాడు.
రామ లక్ష్మణులు పన్నెండు సంవత్సరాల వాళ్ళు, చిన్న పిల్లలు అని మొదట ఒప్పుకోలేదు దశరథుడు కానీ, వసిష్ఠ మహర్షి పిల్లలకు మంచి జరుగుతుంది పంపమన్న సలహా తో రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి తో పంపించాడు.
రామ
లక్ష్మణులతో విశ్వామిత్రుడు సిద్దాశ్రమమనే అయన ఆశ్రమానికి బయలుదేరాడు.
అన్నదమ్ములిద్దరూ
బంగారు ఆభరణాలు ధరించారు. నడుముకి కత్తిని తగిలించుకొని, రెండు భుజాలకు పూర్తిగా
బాణాలతో నిండి వున్న రెండు అమ్ములపొదులను కట్టుకొని చూడటానికి మూడు తలలున్న
నాగుపాములలా వున్నారు. విపరీతమైన కాంతితో మెరిసిపోతున్నారు.
వాళ్ళ
అందానికీ, ధైర్యానికీ విశ్వామిత్రుడు ఆనంద పడిపోయాడు.
సాయంత్ర సమయానికి
సరయు నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరారు.
అప్పుడు
విశ్వామిత్రుడు రాముని చూసి "నదిలో స్నానం చేసిరండి మీకు చక్కని
మంత్రము నేర్పుతాను. దానివల్ల మీకు, ఆకలి, నిద్ర, అలసట ఉండవు. నిద్రలో
ఉన్నప్పుడునైనా మీకెవరూ అపకారము చేయలేరు." అని అన్నదమ్ములకు బల, అతిబల అనే బ్రహ్మ
సృష్టించిన మహామంత్రములను రామలక్ష్మణులకు నేర్పాడు. దానివల్ల రామలక్ష్మణులు
విపరీతమైన తేజస్సు పొందారు.
చీకటి పడిందని ఓ చోట ఆరాత్రి పడుకొన్నారు. మెత్తటి పరుపుల మీద పాడుకొనే రాజకుమారులు గడ్డి నేలమీద కూడా అదే విధంగా ఏ ఇబ్బంది లేకుండా పడుకున్నారు. ఎవరైనా ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి. అన్ని రోజులూ ఒకేలా ఉండవు, ఏ పరిస్థితిలోనైనా ఒకే విధంగా ఉండడం నాయకుని లక్షణం. అది
రామలక్ష్మణులు చిన్నతనంలోనే అలవాటు చేసుకున్నారు.
మరునాడు ఉదయాన్నే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నిద్ర లేపాడు.
ఇంకో విషయమేమిటంటే గురువు అంటే మనకు విద్య నేర్పేవాడు అంటే పాఠాలు మాత్రమేకాదు. ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో ఆ విద్యలన్నీ ప్రేమగా బాధ్యతగా మననుండి ఏమీ ఆశించకుండా నేర్పేవాడు గురువు.
తాటక సంహారం
ఉదయాన్నే విశ్వామిత్రుడు రాముణ్ణి "నాయనా రామా లే
నిద్రలే నాయనా, సూర్యోదయమవుతోంది. మనం దేవతాకార్యం చేయవలసి ఉన్నది
కదా, నిద్రలే" అని లేచిన రాముడు
స్నానం చేసి, గాయత్రి జపం చేసికొనిన తర్వాత
మళ్ళీ బయలుదేరారు.
ఆరోజంతా నడిచి, భీకరమైన హోరుమని శబ్దం వస్తోన్న వైపు చూద్దామని వెళ్లారు. సరయు నది గంగా నదిలో కలిసే ప్రదేశం అది. అక్కడ చాలా మంది ఎంతో జ్ఞానం ఉన్న ఋషులను చూశారు. ఆ నదీ సంగమంలో స్నానాదికాలు పూర్తి చేసుకొని బయలుదేరారు.
ఆ ప్రదేశాన్నిఅంగ దేశం[1] అంటారని రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు వివరించాడు.
ఆ రాత్రికి ఆ
ఋషుల ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని మర్నాడు బయలుదేరారు. గంగానదిని కూడా దాటారు. దాటుతూనే ఒక భయంకరమైన అడవిలోకి అడుగు పెట్టారు. చాలా పెద్ద చెట్లు ఒక దానికొకటి రాసుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. అడవి జంతువులు ఘోరంగా అరుస్తున్నాయి, అక్కడి వాతావరణమంతా భయం
పుట్టేట్టు గా వుంది. ఇంకా కొంచెం దూరములో పూర్తిగా పాడుబడ్డ, మనుషులు ఎవ్వరూ లేని ఊర్లు కనబడ్డాయి. అక్కడ ఏదో తెలియని అలజడిగా ఉంది.
రాముడు విశ్వామిత్రుని తో "స్వామీ ఏమిటీ ఈ ప్రదేశము ఇంత భయంకరముగా, ప్రతికూలశక్తి వున్నట్టుగా వుంది ఎందుకు?" అని అడిగాడు.
అప్పుడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో చెప్పాడు
"ఇది తాటకారణ్యము"
"చాలా రోజుల క్రితం ఇక్కడ మలద, కరూశ[2] మనే ఊళ్ళు జనాలతో కళకళలాడుతూ ఉండేవి. ఇక్కడ తాటక[3] అనే వెయ్యి ఏనుగుల బలమున్న రాక్షసి దాని అతి భయంకరమైన, క్రూరమైన మారీచుడనే కొడుకుతో కలసి ఈ రెండు ఊర్ల మీదపడి అందరిని తిని ఈ ఊర్లను స్మశానాలుగా చేసింది. రామా నువ్వు ఇప్పుడు ఆ రాకాసిని చంపాలి" అని చెప్పాడు.
రాముడు సరే మా తండ్రి గారి అనుజ్ఞ మరియు మీ ఆజ్ఞతో తప్పకుండా
చేస్తానని తన ధనుస్సు ఎత్తి పట్టుకుని వింటి నారిని లాగి వదిలాడు. అప్పుడు పుట్టిన చప్పుడు విని అడవిలో మృగాలన్నీ చెల్లాచెదురుగా పరుగులు పెట్టాయి. ఒక్కసారే కొన్ని వేల పిడుగులు పడ్డాయా అన్నంత శబ్దం అయింది.
ఆ ధ్వని ఆగుతూనే ధన్, ధన్ అని భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ, అరుస్తూ తాటక వచ్చి రామలక్ష్మణుల మీద పడింది. విశ్వామిత్రుడు హుంకారం చేస్తూ దాన్ని అడ్డగించి, రామా ‘నీకు శుభమగుగాక, ఇది ఆడది అని చూడకు’ దీన్ని వెంటనే చంపెయ్యి అని ఆజ్ఞాపించాడు. రాముడు దానిరెండుచేతులనూ బాణాలతో నరికేశాడు. లక్ష్మణుడు దాని మీదకు దూకి ముక్కు చెవులు కోసేశాడు,భయపడి వెళ్లిపోతుందేమో అని. అయినా అది మాయతో రాళ్లు, దుమ్ము వాన కురిపిస్తోంది. రాముడు ఇక లాభం లేదు అనుకొని మరో బాణాన్ని తాటక గుండెలోకి కొట్టాడు. దాంతో అది చచ్చి పడిపోయింది.
రామలక్ష్మణుల సౌర్య పరాక్రమాలకు ఇంద్రుడు దేవతలు వచ్చి మాములు బాణాలతోనే ఇంతటి బలమైన రాక్షసిని చంపాడు. విశ్వామిత్రా
రాముడు నీకు సరి అయిన
శిష్యుడు, నీ దగ్గరున్న అస్త్ర సంపదంతా శ్రీ రామునికి అంద చేయమన్నారు.
దివ్యాస్త్ర సంపద
తనేమనుకున్నాడో దేవేంద్రాదులు కూడా అదే చెప్పారు. రాముణ్ణి పిలిచి అన్ని అస్త్రాలను అందించాలని నిశ్చయించాడు.
విష్ణు చక్రము వంటి అన్ని రకాల చక్రాలనూ, మోదకము వంటి గదా ప్రయోగాలను, శివ శూలము, బ్రహ్మ శిరోనామకము, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, వరుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, భాస్కరాస్త్రము, మానవాస్త్రము మోహనాస్త్రము మొదలైన అన్ని రకములైన అస్త్రాలను ప్రయోగ, ఉపసంహర విద్యలను అన్నింటిని రామునకు విశ్వామిత్రుడు నేర్పాడు. రాముడు లక్ష్మణునకు అంద చేశాడు. అస్త్రాది దేవతలంతా రాముని ముందు ప్రత్యక్షమై "స్వామీ మీ ఆజ్ఞ అనుసరించి మీరు స్మరించిన వెంటనే మీ సంకల్పాన్ని నెర వేరుస్తామని" మాట ఇచ్చి అదృశ్యమయ్యారు.
సిద్ధాశ్రమము
అక్కడినుండి రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు ఎంతో దట్టమైన అడవిలోకి వచ్చారు. అక్కడంతా చక్కటి పూల వాసనలు, అద్భుతమైన పళ్ళ చెట్లూ, పక్షుల కిలకిలారవాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. క్రూరమృగాలు, సాధు జంతువులూ కలసి తిరుగుతున్నాయి.
విశ్వామిత్రుడు రామునితో "నాయనా ఇదే సిద్ధాశ్రమం[4]. ఇక్కడ పూర్వం శ్రీ మహా విష్ణువు తపస్సు చేసాడు.
ఈ
సిద్ధాశ్రమంలో కశ్యపప్రజాపతి కే శ్రీ మహావిష్ణువు వామనుడిగా జన్మించి బలిని జయించాడు. ఇక్కడే కశ్యప ప్రజాపతి సిద్ధి పొందాడు "
"అందుకే దీన్ని సిద్ధాశ్రమము అంటారు”
ఇక్కడ చేసే తపస్సు కొన్ని వేల రెట్ల ఫలితాన్నిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాను. నువ్వు సర్వసన్నద్దుడవై ఈ యాగాన్ని సంరక్షించు." అని యజ్ఞాన్ని పూర్తి చెయ్యడానికి కంకణ బద్ధుడైనాడు.
యాగ సంరక్షణం
విశ్వామిత్రుడు యాగ నియమాన్ని అనుసరించి మౌన వ్రతములో వున్నాడు. ఆ రోజు సూర్యోదయానికి ముందే కాలకృత్య, సంధ్యాది విధులను పూర్తిచేసుకున్న రామ లక్ష్మణులు ఆశ్రమంలోని ఋషుల వద్దకు వెళ్లి వినయ పూర్వకంగా "రాక్షసులు ఎప్పుడు రావచ్చు చెప్పండి, మేము యాగ సంరక్షణను నిర్విఘ్నంగా పూర్తి చేస్తాము" అని అడిగారు.
దానికి ఋషులు “నేటినుండి ఆరు రాత్రులపాటు
జాగ్రత్తగా ఉండమని” చెప్పి వారి పనిలో వారు నిమగ్నమైనారు.
ఆరు రోజులు గడిచాయి. ఆరవరోజు రాత్రి ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్మున్నట్టుగా తాటక కొడుకు మారీచుడు, సుబాహువు ఇంకా
వేలాది రాక్షసులతో గుంపుగా వచ్చి యజ్ఞవేదికపైకి రక్త మాంసాలు గుమ్మరించారు. యజ్ఞవేదిక అంతా రక్తమయమై ఎర్రగా మెరుస్తోంది. రాముడు లక్ష్మణునితో తమ్ముడూ ఈ రాక్షసుల పని పడదామని చెప్పి మానవాస్త్రము మారీచుని మీదికి ప్రయోగించాడు. తమ్ముడూ ఈ మానవాస్త్రము దయగలది వీడిని చంపదు, బలంగా దెబ్బకొట్టి దూరంగా విసిరి వేస్తుంది అంటూ, ఆగ్నేయాస్త్రాన్ని సుబాహునికి గుండెలో నాటు కునేట్టు వేశాడు. సుబాహుడు చచ్చిపోయాడు. మారీచుడు ఎక్కడో చాలా దూరంగా పడిపోయాడు. రాక్షసులు చనిపోయిన వాళ్ళు పోగా మిగతా వాళ్ళు పారిపోయారు. ఆ విధంగా యాగం సంరక్షించాడు శ్రీ రాముడు.
మర్నాడు ఉదయం పూజాదికాలు అయిపోయిన తర్వాత రాముడు విశ్వామిత్రుని వద్దకు వచ్చి
"స్వామీ మీరు నాన్నగారిని అడిగిన కోరికను,
మీ అనుగ్రహం వల్ల ఏ ఆటంకము లేకుండా సంరక్షణ చేయాలిగాము".
"మన తర్వాతి పని ఏమిటి?" అని అడిగాడు.
అప్పటికే విశ్వామిత్రుడు రాముని గురించి ఆలోచిస్తూ ఈ యాగాన్ని ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చేయటానికి రాముడు ఎంతో సహాయం చేసాడు, మరి చేసిన సహాయానికి నేనుకూడా ఆయనకు ఏదయినా మంచి చెయ్యాలి కదా అని అనుకున్నాడు.
అప్పుడు విశ్వామిత్రునితో ఉన్న మునులు "రామా మిథిలా నగరంలో జనక మహారాజు యజ్ఞం నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్లాలని బయలుదేరుతున్నారు. మీరు తోడుగా వెళ్ళండి" అన్నారు.
"మరి జనక మహారాజుగారు మనలను పిలవలేదుగా" అన్నాడు రాముడు.
"యజ్ఞ, యాగాలకు ఎవరైనా వెళ్ళవచ్చు పిలవ వలసిన పని లేదు" అన్నారు మునులు.
దారిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తన కుటుంబ చరిత్ర[5], కుమారస్వామి జననం[6], గంగావతరణం[7] చెప్పాడు. అలా రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలసి మధ్యలో విశాల నగరం[8]లో మహారాజు సుమతి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ రాత్రి అక్కడ గడిపి మరునాడు ఉదయాన్నే మిథిలా నగరానికి బయలుదేరారు.